
ఆ అరకోటి అక్కడి నుంచి తెచ్చిందే..
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సే రేవంత్ రెడ్డి తెచ్చిన రూ.50 లక్షల నగదు ఎక్కడిది, ఆయనకు అందించింది ఎవరన్న అంశాలపై ఏసీబీ అధికారులు కూపీ లాగిన కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు సమీపంలోని ఒక బ్యాంకు బ్రాంచీ నుంచి ఆ సొమ్మును డ్రా చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అంత భారీ మొత్తంలో నగదు ఎవరి ఖాతాలో ఉంది, ఎవరు డ్రా చేశారన్న దిశగా లావాదేవీల పూర్వాపరాలను రాబట్టేందుకు ఏసీబీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ట్రస్ట్ భవన్‌కు అత్యంత సమీపంలోనే ఈ నగదు లావాదేవీలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రేవంత్‌రెడ్డి సెల్‌ఫోన్, ఉపయోగించిన సిమ్‌కార్డులు, కాల్‌డేటా ఆధారంగా ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందనేదానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. రేవంత్‌తో ఫోన్ సంభాషణలకు సంబంధించి 13 నంబర్లను అనుమానాస్పదంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నంబర్ల ఆధారంగా వారి ఆచూకీ కనుక్కోవడంతో పాటు ఇప్పటికే అందులో కొందరిని విచారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ సినీ నిర్మాతను కూడా ఏసీబీ విచారించే అవకాశమున్నట్లు సమాచారం. వివరాలు లీక్ కాకుండా ఈ కేసు విచారణను కొద్దిమంది అధికారులతోనే నిర్వహిస్తున్నారు.