
'బాస్' పక్కన రేవంత్
హైదరాబాద్ : ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'బాస్' పక్కన కూర్చున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి తాత్కాలిక బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డి తొలిసారిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. తన కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అయితే వాళ్లిద్దరూ చిరునవ్వు నవ్వడమే తప్ప...పలకరించుకోలేదు.
కాగా రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా ఆయనకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని సూచించింది. విచారణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయరాదని స్పష్టం చేసింది. దాంతో కోర్టు నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన అతిథులను పలకరించలేకపోయారు. మరోవైపు సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు నిఘా కొనసాగింది. రేవంత్ కదలికలపై వారు దృష్టి పెట్టారు. బెయిల్ మంజూరు చేస్తాం, కానీ రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించిన విషయం తెలిసందే.