ఆర్‌ఎంపీ దారుణ హత్య
సాగర్‌కాల్వ వద్ద మృతదేహం లభ్యం
ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం త్రిపూరారం గ్రామానికి చెందిన సూడి రాజశేఖరరెడ్డి(21) అదే మండలానికి చెందిన స్వాతితో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
తొమ్మిది నెలలుగా కూసుమంచి మండలం గట్టుసింగారంలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదే గ్రామంలో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం అఖిల్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరు రాజశేఖర్ వద్దకు వచ్చి తాము వరి కోత మిషన్‌పై పనిచేస్తున్నామని, జ్వరం వచ్చిందని ఇంజెక్షన్ చేయించుకుని వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అదే ముగ్గురు రాజశేఖర్ వద్దకు వచ్చి వరి కోతల పని పూర్తికావడంతో తాము తిరిగి వెళ్లిపోతున్నామని చెప్పారు. వీడ్కోలు సందర్భంగా పార్టీ చేసుకుందామని అన్నారు. ఈ ప్రతిపాదనను రాజశేఖర్ నిరాకరించాడు. తనకు పని ఉందని, పార్టీ చేసుకునేందుకు రాలేనని చెప్పాడు.
దీంతో వెళ్లిపోయిన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని, ఖమ్మంలో తెలిసిన ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు రావాలని రాజశేఖర్‌కు చెప్పాడు. దీంతో రాజశేఖర్ బయల్దేరి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత భార్య ఫోన్ చేసి అడగగా తాను ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. తాను తీసుకెళ్లిన పేషేంట్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కొద్ది సేపట్లోనే బస్సు ఎక్కి ఇంటికి వచ్చేస్తానని అన్నాడు. అయితే రాత్రి తొమ్మిది దాటినా రాజశేఖర్ ఇంటికి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో స్వాతి కంగారుపడిపోయింది.
మృతదేహాన్ని గుర్తించారిలా..
సాగర్‌కాల్వ పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉందంటూ కొందరు ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పక్కన బీరుసీసాలతోపాటు తినుబండారాలు ఉన్నాయి. మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు.
కాల్వ క ట్ట పక్కన ఓ యువకుడి మృతదేహం ఉందని, మృతుడు గడ్డంతో ఉండి టీషర్టు ధరించి ఉన్నాడని గట్టుసింగారం గ్రామస్తులకు తెలిసింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన స్వాతి ఖమ్మం ఆస్పత్రికి చేరుకుంది. మృతదేహం తన భర్త రాజశేఖర్‌దేనని గుర్తుపట్టి భోరున విలపించింది. ఈ మేరకు సీఐ తిరుపతిరెడ్డి కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.