నాలుగురోజుల్లో పెళ్లి.. అంతలోనే !
పెళ్లికూతురుగా ముస్తాబై అత్తారింట్లో అడుగు పెట్టేందుకు ఇంకా నాలుగు రోజులే ఉంది.
► మరో నలుగురి పరిస్థితి విషమం
► కుటుంబంలో తీరని విషాదం
పెళ్లికూతురుగా ముస్తాబై అత్తారింట్లో అడుగు పెట్టేందుకు ఇంకా నాలుగు రోజులే ఉంది.. పెళ్లిపనులు చకచకా జరుగుతున్నాయి.. బంధువులు వివాహానికి రావడానికి సిద్ధమవుతున్నారు.. కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లిబట్టలు తీసుకొని బయల్దేరారు. పదినిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు. అంతలోనే ఆ కుటుంబంలో తీరని విషాదం. వారు ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. పెళ్లిచేసుకోవాల్సిన యువతి దుర్మరణం పాలైంది. ఈ సంఘటన ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బతీసింది.
గద్వాల క్రైం: గద్వాల పట్టణంలోని నల్ల కుంట వీధికి చెందిన బానుజీ, ఎగ్బాల్ దంపతుల కూతురు రజియాబేగం (24)ను కర్ణాటక రాష్ట్రం మాన్వి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 14న పెళ్లి చేయడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పెళ్లికూతురు వస్త్రాలు, ఆభరణాల కోసం కుటుంబసభ్యులు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాజియాబేగంతోపాటు అబ్దుల్ రెహమాన్, మోయిన్, మహ్మద్ మస్తాన్‌లు కారులో బయల్దేరారు. 10 నిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు.
కారు వీరాపూర్ సబ్‌స్టేషన్ వద్దకు రాగానే కారు డ్రైవర్ బాషా ఎదురుగా ఉన్న డివైడర్‌ను గమనించకలేదు. దీంతో వేగంగా వస్తున్న వాహనం డివైడర్‌ను ఢీ కొట్టి అమాంతం గాలిలో ఎగిరి రోడ్డుమీద పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందుతుండగా పెళ్లికూతురు రజియాబేగం బుధవారం ఉదయం చనిపోయింది. మిగతా నలుగురి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
కోలుకోలేని విషాదం
ఈ సంఘటనతో బాధిత కుటుంబంలో విషాదం అలుముకుంది. సంతోషంగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉండాల్సిన కూతురు మరణవార్త విన్న తల్లిదండ్రుల రోదనలను ఎవరూ ఆపలేకపోయారు. వారు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు అందరిని కలిచివేసింది. పెళ్లికి రావాల్సిన బంధువులు చావు వార్త విని నమ్మలేకపోయారు. ఈ సంఘటన విన్నవారందరూ కంటతడి పెట్టారు.