
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుర్తించడంతో పాటు ఆయా కేసులను పక్కాగా దర్యాప్తు చేసేందుకుగాను సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ (ఆర్టీఏ) మానిటరింగ్ సెల్ సత్ఫలితాలు ఇస్తోందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది మార్చ్ 19 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సెల్ ఇప్పటి వరకు 12 హిట్ అండ్ రన్ (ప్రమాదం చేసి ఆగకుండా వెళ్లిపోవడం) కేసులను కొలిక్కి తీసుకువచ్చిందని, మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో ప్రమాదంగా నమోదైన హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ మహ్మద్ వహీదుద్దీన్ నేతృత్వంలో పని చేస్తున్న ఈ విభాగం ప్రతి ప్రమాద స్థలాన్ని సందర్శించి నిశితంగా దర్యాప్తు చేయడంతో పాటు కారణాలతో కూడిన డాక్యుమెంట్లనూ రూపొందిస్తోంది. ఈ ప్రక్రియలో అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు తదితరాలను పరిగణలోకి తీసుకుంటోంది. వీటితో పాటు ప్రమాద ఘటనల్లో మృతులుగా మారిన వారి కుటుంబాలకు, బాధితులకు సహాయం అందించడంలోనూ చర్యలు తీసుకుంటోంది. అత్యుత్తమ ఫలితాల కోసం ఈ సెల్ స్థానిక శాంతిభద్రతల విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నట్లు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి, రోడ్ ఇంజినీరింగ్‌లో మార్పులకు కీలక సూచనలు చేస్తోందన్నారు. గత రెండు నెలల్లో ఈ సెల్ పనితీరుపై నివేదికను ఆయన విడుదల చేశారు.
కీలక కేసుల వివరాలివీ...
♦ మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో మే 6న ఒక హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. తెల్లవారుజామున మసీదుకు వెళ్తున్న మహ్మద్ ఖాన్‌ను ఓ వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రంగంలోకి దిగిన ఆర్టీఏ సెల్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఎట్టకేలకు వాహనాన్ని గుర్తించి లోతుగా దర్యాప్తు చేయగా అది హత్యగా వెలుగులోకి వచ్చింది. దీంతో ముగ్గురు నిందితులు కటకటాల్లోకి చేరారు.
♦ కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో మార్చ్ 19న జేఎన్టీయూ నుంచి మియాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్న మహేశ్వరిని ఓ బస్సు ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఘటనాస్థలిలో సీసీ కెమెరాలు లేకపోయినా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి సెల్ ప్రమాదానికి కారణమైన బస్సు కర్ణాటక ఆర్టీసీకి చెందినదిగా గుర్తించింది.
♦ శామీర్‌పేట పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న డి.శ్రీనివాసరావు కిందపడి మృతి చెందాడు. ఆటో డ్రైవర్ వాహనాన్ని అతి వేగంగా నడపడమే ఇందుకు కారణంగా తేల్చారు.
♦ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.నిరీక్షణ్‌రావు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఉదంతం జరిగిన ప్రాంతంలో కొంత మేర రోడ్డు ధ్వంసమైంది. దీనికి కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు నిర్థారించారు.
♦ శామీర్‌పేట పరిధిలో ఆటోలో వెళ్తున్న బోయ వీరాస్వామిని పొట్టనపెట్టుకున్న ప్రమాదానికి వాటర్ ట్యాంకర్ కారణంగా తేలింది. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను తప్పించబోయిన ఆటో దానిని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment