
సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకొని గడువులోగా టికెట్ రద్దు చేసుకోలేని వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వారికి మరోమారు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని సవరించింది. టికెట్లకు నగదు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య రిజర్వేషన్ చేసుకున్న వారికి సైతం అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
రిజర్వేషన్‌కు సంబంధించి ఓ నిర్ణీత కాల పరిమితి వరకు టికెట్ క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా చాలామంది తమ టికెట్లను నిర్ణీత కాలపరిమితి లోపు రద్దు చేసుకోలేకపోయారు. దీంతో వారికోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నిబంధనల్ని సవరించింది. దీని ప్రకారం ఈనెల 29 లోపు ప్రయాణికులు వారి టికెట్లను రద్దు చేసుకోవచ్చంటూ తెలిపింది. దగ్గర్లోని బస్టాండు లేదా ఎటీబీ కౌంటర్‌లో టికెట్ చూపించి క్యాన్సిల్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment