
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఆర్టీసీ బస్సులు మృత్యుశకటాలను తలపిస్తున్నాయి. నడిరోడ్డుపై నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. సోమవారం గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగానికి ముగ్గురు అమాయకులు బలైన సంఘటన నగరవాసులను భయాందోళనకు గురి చేసింది. గతంలో ఇదే డ్రైవరే నిర్లక్ష్యంగా బస్సు నడిపి జూబ్లీహిల్స్‌లో ఒక మహిళ మృతికి కారణమయ్యాడు. రెండేళ్ల క్రితం కవాడిగూడలో జరిగిన ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలికలు మృత్యువు పాలయ్యారు. ఈ ఘటనలో చెంగిచెర్ల డిపోకు చెందిన డ్రైవర్‌కు పక్షవాతం లక్షణాలు తిరగబెట్టడంతో బస్సును నియంత్రించలేకపోవడంతో ప్రమాదం జరిగింది. అప్పట్లో ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఇదే కాకుండా ఇటీవల అనేక ప్రమాదాల్లోనూ ఆర్టీసీ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుభవం, నైపుణ్యం, శిక్షణ లేని డ్రైవర్లకు బస్సులను అప్పగించడంతో రహదారులపైకి యమదూతల్లా దూసుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సిటీ బస్సుల కారణంగా 62 ప్రమాదాలు జరగగా 17 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా, 27 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
సరైన శిక్షణ లేనందునే...
♦ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 29 డిపోల పరిధిలో 8 వేల మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సగానికి పైగా గతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వాళ్లే.
♦ గతంలో లారీలు, డీసీఎంలు తదితర వాహనాలు నడుపుతూ ఆర్టీసీలోకి ప్రవేశించిన వీరికి సరైన శిక్షణ లేకపోవడం, ప్రయాణికుల పట్ల, రహదారి నిబంధనల పట్ల నడుచుకోవలసిన తీరుపై అవగాహన కల్పించకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారు.
♦ ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా వ్యక్తిగతంగా డ్రైవర్ల విధి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
♦ ప్రస్తుత ప్రమాదానికి కారకుడైన జహంగీర్ గతంలో జూబ్లీహిల్స్ ప్రాతంలో రోడ్డుదాటుతున్న కమలమ్మ అనే మహిళ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది. దీంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
ఫిట్‘లెస్’ బస్సులు....
♦ మరోవైపు డొక్కు బస్సులు కూడా ప్రజల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. నగరంలో 3850 బస్సులు ఉండగా, వాటిలో కనీసం 800 బస్సులు కాలం చెల్లినవే కావడం గమనార్హం. ఇలాంటి బస్సులు తరచూ చెడిపోయి బ్రేక్‌డౌన్‌లకు గురవుతున్నాయి. అసలే సరైన శిక్షణ, ట్రాఫి క్ నిబంధనల పట్ల అవగాహన లేని డ్రైవర్ల కార ణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
♦ నగరంలో ఆర్టీసీ బస్సుల కారణంగానే 11 శా తం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
♦ సిగ్నల్ జంపింగ్‌లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకైతే లెక్కే ఉండడం లేదు. వేల సంఖ్యలో ఇలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి.