
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..
ఇనుపాముల(కేతేపల్లి) : మండలంలోని ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 38 మంది ప్రయాణికులతో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈక్రమంలో మార్గమధ్యలో మండలంలోని ఇనుపాముల శివారులో గల బైపాస్ జంక్షన్ వద్ద హైవేపై యూటర్న్ తీసుకుంటున్న లారీ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది.
ఇది గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యే లోపే బస్సు లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో బస్సు ఎడమ వైపున ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తెనాలికి చెందిన ఆళ్లపాటి శివకుమార్, రేపల్లెకు చెందిన తుమ్మల శ్రీహరి, వంశీకృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్‌ఐ వి.బాలగోపాల్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.