సాక్షి, హైదరాబాద్: లాభాల మాట ఎన్నడో మరిచిపోయిన ఆర్టీసీ.. దాదాపు దశాబ్దం తర్వాత భారీ రాబడితో గాడిన పడినట్టు కనిపించింది. హైదరాబాద్ సిటీ జోన్ మినహా మిగతా రెండు జోన్లు ఒకేసారి లాభాలు సాధించి సంస్థలో కొత్త జోష్‌ను నింపాయి. కానీ ‘వరి గడ్డి మంట’ చందంగా ఆ సం తోషం ఎక్కువ రోజులు నిలవలేదు. స్వయం గా ప్రభుత్వ నిర్లక్ష్యమే లాభాల బాట పట్టిన ఆర్టీసీని మళ్లీ నష్టాలు చవిచూసేలా చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల సంఖ్యలో ప్రైవేటు అక్రమ సర్వీసులకు బ్రేకులు పడగా.. ఇప్పుడు ప్రభుత్వం చూసీ చూడనితనంతో అవి రోడ్డె క్కి బుకింగ్స్‌తో దూసుకెళ్తున్నాయి. దీంతో ఆర్టీసీ రూ.72 కోట్ల నష్టాలు చవి చూసింది. అంతకు ముందు నెలకంటే దాదాపు రూ.40 కోట్లు అధికం కావటం గమనార్హం.
పైన పటారం..
ప్రైవేటు బస్సుల అక్రమ సర్వీసులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందన్నది ప్రభుత్వానికి తెలియని విషయమేమీ కాదు. ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ దాదాపు రూ.వేయి కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుందని నిపుణులు కూడా గతంలో నివేదికలు అందజేశారు. గతేడాది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్టీసీపై జరిపిన సమీక్షలోనూ దీనిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో ఆర్టీసీ, రవాణా శాఖలు కలసి ప్రైవేటు అక్రమ సర్వీసుల విషయంలో చర్యలు తీసుకునేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాటి సంయుక్త రవాణా కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక వ్యవ స్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ప్రైవేటు అక్రమ సర్వీసులను నియంత్రించేం దుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పేరు కు చర్యలు గంభీరంగానే ఉన్నా.. వాస్తవంగా జరుగుతోంది మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.
మళ్లీ పెరిగిన నష్టాలు..
రవాణా చట్టాలు ఎంతగా అపహాస్యమవుతున్నాయో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన చర్యల ద్వారా ఇటీవల బహిర్గతం చేసింది. ఆ రాష్ట్రంలో పర్మిట్లు పొంది వేరే రాష్ట్రాలు కేంద్రంగా అక్రమంగా వేల సంఖ్యలో బస్సులు తిరుగుతున్న తీరును బయటపెట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా దాదాపు వెయ్యి వరకు బస్సులున్నట్టు తేలింది. వాటిలో తెలంగాణ వాటా దాదాపు 400. ఈ నేపథ్యంలో ఆ బస్సులను నిషేధించింది. ఇదే సమయంలో ఆర్టీసీ దూర ప్రాంతాలకు దాదాపు 150 సర్వీసులు ప్రారంభించింది. ఈ రెండు చర్యల కారణంగా ఒక్కసారిగా ఆర్టీసీకి గణనీయ సంఖ్యలో రాబడి పెరిగి నష్టాలు బాగా తగ్గాయి. రెండు జోన్లు లాభాల్లోకి రావటంతో.. నష్టాలు గణనీయంగా తగ్గాయి. ప్రతినెలా రూ.వంద కోట్లకుపైగా నష్టాలు వస్తుండగా, ఆ మొత్తం రూ.40 కోట్లకు తగ్గింది. దీంతో ఆర్టీసీ దూర ప్రాంతాల సర్వీసుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. మరో నెలరెండు నెలల్లో ఆ మాత్రం నష్టాలు కూడా ఉండవన్న సంకేతాలిచ్చింది. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయింది. నెల క్రితం రూ.40 కోట్లకే పరిమితమైన నష్టాలు తాజాగా రూ.72 కోట్లకు చేరుకున్నాయి. కారణాలను విశ్లేషించిన ఆర్టీసీ అధికారులు మళ్లీ ప్రైవేటు అక్రమ సర్వీసులు రోడ్డెక్కడమే ప్రధాన కారణమని తేల్చారు.
పట్టించుకోవద్దని ఆదేశాలు
ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులు మళ్లీ రోడ్డెక్కి పరుగు ప్రారంభించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఇప్పటికే పలుమార్లు రవాణా శాఖ దృష్టికి తెచ్చారు. కానీ రవాణా శాఖ అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోయారు. ఆ బస్సుల విషయంలో చూసీచూడనట్టు ఉండాలన్న బడా నేతల ఆదేశాలే దీనికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ‘దాదాపు 3 నెలలుగా దూరప్రాంత సర్వీసులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కొత్త బస్సులెన్ని తెచ్చిపెట్టినా నిండుగా వెళ్తున్నాయి. దీంతో లాభాలు వస్తున్నాయి. కానీ నెల రోజులుగా తీరు మారింది. కొన్ని బస్సులు రద్దు చేసుకోవాల్సి వస్తోంది. రద్దయిన ప్రైవేటు బస్సులు యథాప్రకారం తిరగటమే ఇందుకు కారణం’ అని ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు. బాహాటంగా మాట్లాడ్డానికి జంకుతున్నా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఆ ప్రైవేటు బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment