సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోవడంతో పాటు కనీసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయకపోవడంతో కార్మికుల జీతాలకు సైతం నానా తిప్పలు పడి సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజా సమావేశంలో చార్జీల పెంపు ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదన గతేడాదే వచ్చినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.
సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తరుణంలో ఇప్పుడు మరోసారి టికెట్ల పెంపు చర్చకు రావడం గమనార్హం.
పెరుగుతున్న డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయం, కార్మికుల వేతనాల పెంపు, వడ్డీల చెల్లింపు వంటి అంశాలు ఆర్టీసీకి తీవ్ర ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని పలువురు నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిసింది. పలు కార్మిక సంఘాలు కూడా పెంపునకు సుముఖంగానే ఉన్నాయి. అయితే ఆ పెంపుదల హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం కమిటీ వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశాయి. అదే సమయంలో ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్‌లో కనీసం ఒక శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా ఈసారి పెంపు లోక్‌సభ ఎన్నికల దాకా ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఖాళీ స్థలాలన్నీ తాకట్టు...!
ప్రభుత్వపరంగా ఆర్టీసీకి ఇంతవరకూ ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. ఇప్పుడున్న రూ. 3 వేల కోట్ల అప్పులపై ఏటా రూ. 250 కోట్ల వరకు వడ్డీల కింద చెల్లిస్తున్నారు. మరోవైపు ఇటీవల 16 శాతం ఐఆర్ పెరిగింది. దీంతో కార్మికుల వేతనాలు సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది. విధిలేని పరిస్థితుల్లో క్రెడిట్ అండ్ కార్పొరేట్ సొసైటీకి చెల్లించాల్సిన వివిధ రకాల రికవరీ నిధులను సంస్థ మళ్లిస్తూ వస్తోంది. ఇలా పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ఇటీవల జూబ్లీ బస్టాండు సమీపంలోని స్థలాన్ని ఆర్టీసీ తాకట్టు పెట్టినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం పూచీకత్తుగా నిలవడంతో ఆర్టీసీ రూ. 500 కోట్లు అప్పులు తెచ్చుకోగలిగింది. ఇందులో నుంచి రూ.80 కోట్లు (మొత్తం రూ. 500 కోట్లు) తిరిగి సీసీఎస్‌కు చెల్లించింది. సంస్థ తన పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను చాలావరకు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టింది. అయితే ఇలా తాకట్టు పెట్టుకుంటూపోతే చివరికి ఏమీ మిగలదని, ఆర్టీసీ భవితవ్యం గందరగోళంలో పడుతుందని సిబ్బంది, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఇతర సంస్థలంటేనే మక్కువ...
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీపై సవతి తల్లిప్రేమ ప్రదర్శిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుశాఖకు ప్రభుత్వం దాదాపు రూ. 800 కోట్లు మంజూరు చేసి దాదాపు 15 వేల వాహనాల కొనుగోలుకు సహకరించింది. విమానయానాన్ని ప్రోత్సహించేందుకు విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్‌ను 1 శాతానికి కుదించిన సర్కారు ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌పై మాత్రం దాదాపు 27 శాతం వ్యాట్ విధిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసుల ప్రారంభంతో ఆర్టీసీ రోజుకు లక్ష మందికిపైగా ప్రయాణికులను కోల్పోతోంది. అయితే పర్యావరణ కోణంలో మెట్రోను స్వాగతించాలని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నా కనీసం సంస్థకు ఆర్థిక చేయూత ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ వల్ల రోజుకు ఆర్టీసీకి రూ. కోటికిపైగా నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం వాటి నియంత్రణపై దృష్టి సారించట్లేదని మండిపడుతున్నారు.
ఆర్టీసీ నష్టాలకు కారణాలేంటి?
– విభజన తర్వాత పంపకాల్లో వచ్చిన రూ. 2 వేల కోట్లకుపైగా అప్పులు
– ఏపీఎస్‌ఆర్టీసీతో టీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేకపోవడంతో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణలో తిరిగినంతగా తెలంగాణ బస్సులు ఆంధ్రలో తిరగలేక భారీగా ఆదాయం నష్టపోతుండటం
– 2015లో ఒకేసారిగా 5 వేల మందిని రెగ్యులరైజ్ చేయాల్సి రావడం, ఇటీవల 16 శాతం ఐఆర్‌తో అదనపు ఆర్థికభారం పడటం
– టికెట్టేతర ఆదాయం పెంపుదలపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించకపోవడం
– కొంతకాలంగా శాశ్వతంగా ఎండీ, ప్రస్తుతం మంత్రి, చైర్మన్ లేకపోవడం వల్ల కూడా సంస్థ ఆదాయం పెంచుకునే అన్వేషణలో వెనకబడిందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఇలా (అంకెలు రూ. కోట్లలో)
ఏడాది బడ్జెట్ కేటాయింపులు విడుదల చేసిన నిధులు నష్టాలు
2014–15 – – 240
2015–16 400 210 750
2016–17 650 265 770
2017–18 995 325 620
2018–19 975 330 (సెప్టెంబర్ వరకు) 461 (నవంబర్ వరకు)
మొత్తం 3,020 1,030 2,841
ఆర్టీసీ యూనియన్లతో నిపుణుల కమిటీ భేటీ...
ఆర్టీసీ ప్రక్షాళనకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం వివిధ కార్మిక సంఘాలతో సమావేశమైంది. ఎంజీబీఎస్‌లో జరిగిన ఈ భేటీకి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నుంచి రాజిరెడ్డి, బాబు, నరసింహన్ హాజరయ్యారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎమ్‌యూ) నుంచి నాగేశ్వరరావు, కమలారెడ్డి, నరేందర్, మలానా, అశోక్ కమిటీతో సమావేశమయ్యారు. సీఐటీయూ నుంచి శ్రీనివాసరావు, ఏవీ రావు, రవీందర్‌రెడ్డిలు భేటీ అయ్యారు. వారందరితో కమిటీ విడివిడిగా చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సంస్థను లాభాల పట్టించేందుకు ఆయా సంఘాలు తమ కార్యచరణను నివేదిక రూపంలో విడివిడిగా సమర్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment