సాక్షి, హైదరాబాద్: ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఎంతగానో ఆదుకుంటున్న రైతుబీమా పథకానికి మరింత ఆదరణ పెరుగుతోంది. భూ మార్పిడి చేసుకుని, కొత్తగా పట్టాదారులైన రైతులు తమకు బీమా కల్పించాలని కోరుతూ వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)ను సంప్రదిస్తున్నారు. దీంతో కొత్త పట్టాదారు రైతులకు రైతుబీమా సౌకర్యం వెంటనే కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్‌ఐసీ వారికి బీమా ప్రీమియం చెల్లించేందుకు కొత్తగా జారీ చేసిన పట్టాదారుల వివరాలను తమ శాఖకు ఇవ్వాలని రెవెన్యూ శాఖను కోరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు. ఏఈవోలు కొత్తగా నమోదైన పట్టాదారుల వివరాలను, నామినీ పత్రాలను తీసుకుని బీమాలో నమోదు చేస్తారని పార్థసారథి లేఖలో పేర్కొన్నారు.
రైతు బీమాకోసం ఎల్‌ఐసీతో చేసుకున్న ఒప్పందంలో కొత్తగా వచ్చే పట్టాదారులకు కూడా బీమా సౌకర్యం కల్పించే వెసులుబాటు ఉందని తెలిపారు. ప్రతివారం ఒకరోజు (సోమవారం) పేరు మార్పిడి జరిగిన పట్టాదారుల వివరాలు, కొత్తగా నమోదైన పట్టాదారుల పేర్లు వ్యవసాయ శాఖకు పంపాలని కోరారు. కొత్త పట్టాదారు రైతులు లక్షపైన ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 14వ తేదీ నుంచి రైతుబీమా అమల్లోకి వచ్చింది. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న పట్టాదారులందరికీ రైతుబీమా వర్తిస్తుంది. దీని ప్రకారం మొత్తం 29.58 లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి ఒక్కో రైతుకు రూ. 2,271.50 చొప్పున మొత్తం రూ.672 కోట్లు చెల్లించింది. నాటినుంచి ఇప్పటివరకు 10,012 మంది రైతులు దురదృష్టవశాత్తు మరణించగా ఆ కుటుంబాలకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. మొత్తం రూ.500.60 కోట్లు పరిహారం ఎల్‌ఐసీ నుంచి రైతు కుటుంబాలకు అందింది. వీరంతా చిన్న కమతాలు కలిగిన రైతులే కావడం గమనార్హం.
ప్రీమియం రేటు పెంచే అవకాశం
ఎల్‌ఐసీ రైతుబీమా కోసం ఈసారి ప్రీమియం రేటును పెంచనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై ఒక నివేదికను తయారు చేసుకున్నట్లు ఎల్‌ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇంత మొత్తంలో మరణాలు సంభవిస్తాయని ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు ఊహించలేదు. దీంతో ఒక్కో రైతుకు రూ. 2,271.50 గా ఉన్న ప్రీమియం రేటును ఈసారి రూ. 2,500లకు పైగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత బీమా కాలపరిమితి ముగిసేందుకు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో ఇంకా రూ.100 కోట్ల వరకు చెల్లింపులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment