సాక్షి, హైదరాబాద్: షిరిడీ సాయిబాబా.. ఎందరికో ఆధ్యాత్మిక గురువు.. మరెందరికో దైవం! మనిషి తనను తాను తెలుసుకునేందుకు, దైవత్వం గురించి అర్థం చేసుకునేందుకు ఆధ్యాత్మికత ఒక మార్గం. సాయిబాబా మహా సమాధి అయి వందేళ్లు అయిన సందర్భంగా.. సాయితత్వం ఏమిటి? ఆయన బోధనలు ఎవరి కోసం తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాయి గ్లోబల్ మూవ్‌మెంట్ సూత్రధారి చంద్రభాను శతపతిని కలిసింది. ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాట్లాడింది. ఆ వివరాలివీ..
షిరిడీ సాయిబాబా మహా సమాధి అయి వందేళ్లు అయింది. దాని ప్రాముఖ్యతను వివరించగలరా?
సాధారణ పరిభాషలో ఒక వ్యక్తి తన శరీరాన్ని వదలడాన్ని మృత్యువు అంటాం. శరీరం సమాధిలో కప్పబడితే అతడు సమాధి అయ్యారు అంటాం. కానీ ఆధ్యాత్మిక రంగానికి వస్తే.. వేదాంతం ప్రకారం భౌతిక ఉనికి అన్న పరిమితిని దాటి సూక్ష్మ శరీరంతో కొనసాగించగలిగే వారు తమ శరీరాన్ని వదిలివేయడాన్ని మహా సమాధి అంటాం. సాధారణ వ్యక్తి మరణిస్తే అతడు మళ్లీ రాడన్న బెంగతో బాధపడే వాళ్లు ఉంటారు. షిరిడీ సాయి వంటి వారు శరీరాన్ని వదిలినా తమ సూక్ష్మ శరీరంతో ఉంటారు. వారు నిత్యం దేవుడితో మమేకమవుతుంటారు. ఇది వారిని అనుసరించే వారు ఆనందించే విషయం. మరణానికి ముందు.. తర్వాత అన్న హిందూ ఆధ్యాత్మిక వాదం తాలూకూ సైన్స్ ఇదే. ఈ నేపథ్యంలోనే షిరిడీ సాయి మహా సమాధి పొంది వందేళ్లయిన సందర్భాన్ని చూడాల్సి ఉంటుంది.
షిరిడీ సాయి తత్వం ఏమిటి? భక్తులు అనుసరించాల్సిన మార్గం ఎలా ఉండాలి?
సాయి అన్న పదం వేర్వేరు అర్థాలను సూచిస్తుంది. సాయి అంటే భగవంతుడు.. పాలకుడు.. రక్షకుడు.. తండ్రి. మీ ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలు ఎవరైతే తీరుస్తారో వారు ఆధ్యాత్మిక పురుషులవుతారు. ప్రాపంచిక అవసరాలు మన అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ.. ఆశలకు తగ్గట్టు కాదు. ఆధ్యాత్మిక గురువులు అందరూ దీన్నే ఆచరించారు. షిరిడీ సాయి తత్వం మొత్తం ఆధ్యాత్మిక స్థాయిలో మానవులందరూ ఇతరులకు సాయం చేసేలా, మార్గదర్శనం చేసేలా ఎదగాలని చెబుతుంది. అందరినీ సమానంగా చూడాలని చెబుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు సమాజంలో ధర్మం గతి తప్పినప్పుడు అంటే సమాజపు కట్టుబాట్లను అనుసరించని.. లేదా ఆ కట్టుబాట్లు ఆయా కాలపు సమాజాలకు పనికిరాకుండా పోయిన సందర్భాల్లో వాటిని మార్చాలి. లేదంటే ప్రకృతి స్వయంగా వాటికి అడ్డుకట్ట వేస్తుంది.
ఇటీవల షిరిడీ సాయిబాబాపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి. మీరేమంటారు?
చరిత్రను చదివితే షిరిడీ సాయి బాబా ఉన్నప్పుడు ఈ వివాదాలు లేవని స్పష్టమవుతుంది. వందేళ్ల తర్వాత ప్రజలకు వారివైన ఆలోచనలు ఏర్పడ్డాయి. బాబాతో అనుబంధం ఉన్న వారి అనుభవాలు గమనిస్తే వివాదాలేవీ కనిపించవు.
సాయి తత్వంతో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
సాయిబాబాపై తీసిన ఒక సినిమా చూసిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలని అనుకున్నా. చదివిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం నచ్చింది. అతడి దయాగుణం.. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరించడం.. అందరికీ అతడు ఆదరణీయుడు కావడం... ఆయన గొప్పతనానికి కొన్ని నిదర్శనాలు.
సమాజంలో అసంతృప్తి ఎక్కువైందన్న వాదనలున్నాయి. నిర్మాణాత్మక చర్చకు తావు లేకుండా పోతోంది. దీనిపై బాబా సూచించే మార్గం ఏమిటి?
ఇదో సామాజిక, రాజకీయ పరిస్థితికి సంబంధించిన ప్రశ్న. తన జీవితం మొత్తం సాయి చెప్పింది ఒక్కటే.. ఓపికతో ఉండ మని. సమాజం ఎప్పుడు ఒకే రీతిలో ఓపికతో లేదు. హెచ్చు తగ్గులున్నాయి. ఇంతకంటే ఎక్కువగా ఈ అంశంపై వ్యాఖ్యానించడం సరికాదు.
మీరు నమ్మే సత్యం?
మంచితనానికి మించిన దైవత్వం లేదన్నది నేను నమ్మే అంశంహేతువాదం, ఆధ్యాత్మిక వాదాల్లో మనిషి ఏది ముందు ఆచరించాలి? రెండూ వేర్వేరు కాదు. హేతువాదం అంటే ఆధునిక శాస్త్రం సృష్టించిన వ్యవస్థ. పరిక రాలు, పద్ధతులు అభివృద్ధి చేయడం తర్కబద్ధంగా ఆలోచించడం వంటివన్నీ ఇందు లో ఉంటాయి. ఆధ్యాత్మికతకు ఇవేవీ అవసరం లేదని అనుకుంటారు. ప్రాథమికం గా ఈ ఆలోచనే తప్పు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారు తమ శక్తులన్నిం టినీ కేంద్రీకరించి.. తమ ఉనికి, దేవుడి గురించి ఆలోచనలు చేస్తుంటారు. పూర్వం యజ్ఞాలు, హోమాల ద్వారా దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఆధునిక యుగంలో మనిషి సైన్స్ ద్వారా పదిమందికి ఉపయోగపడే పనిచేస్తున్నాడు. సామాజిక అభ్యున్నతి కోసం జీవితాలను అంకితం చేసిన శాస్త్రవేత్తలు కూడా దేవుడిని అన్వేషిస్తున్న వారిగానే చూడాలి.
బాబా భక్తులకు మీరిచ్చే సందేశం?
సాయిబాబా భక్తులకు అందాల్సిన సందేశం వారికి ఎప్పుడో అందింది. ఒక భక్తుడిగా నాకేం తెలుసో.. వారికీ అది తెలుసు.
Comments
Please login to add a commentAdd a comment