‘మాది వ్యవసాయ కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి బావులు తవ్వి వచ్చిన కూలీ డబ్బులతో జొన్నలు తీసుకొస్తేనే ఇస్రాయి పెట్టి గటుక ఇస్రీ కుటుంబమంతా తినేవాళ్లం. వారానికి నాలుగు రోజుల్లో ఇప్పపువ్వు పరక కాల్చి తిని కడుపునింపుకునే పరిస్థితి. పస్తులుండి పొలంలో పని చేసేవాడిని. బాల్యమంతా కష్టాలతోనే గడిచిపోయింది. ఇంటికి పెద్దదిక్కైన మా నాన్న నాగోరావు బాల్యంలో కుటుంబ భారాన్ని మోసి అండగా నిలిచారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ ఇంట్లో తిండిలేక ఆశ్రమ పాఠశాలలోనే చదువుకున్న. ఇంటర్ సెకండియర్‌లోనే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పుడు కడుపునిండా అన్నం దొరికింది. ఉద్యోగం చేస్తూనే ఆదివాసీల సమస్యలపై ఉద్యమాలు చేశాను. నెలజీతమంతా ఆదివాసీ ఉద్యమాల కోసమే ఖర్చయ్యేవి’ అని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. ‘సాక్షి పర్సనల్ టైం’లో ఆయన అనేక విషయాలు వెల్లడించారు.
సాక్షి, ఇచ్చోడ(బోథ్) : మాది బోథ్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన అజ్జర్‌వజ్జర్. మా నాన్న నాగోరావు తల్లి లక్ష్మిబాయిలకు మేము ఏడుగురు సంతానం. అన్నలు కమ్ము, సోనేరావు, సూర్యరావు, మానిక్‌రావు, లక్ష్మణ్, తమ్ముడు రాము, చెల్లులు భూమాబాయి కుటుంబంలో నేను ఆరోవాణ్ణి. అజ్జర్‌వజ్జర్‌లో వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ పంటలు పండక పొలాలన్నీ బీడుగా మారేవి. ఉన్నదాంట్లోనే కుటుంబమంతా కాయకష్టం చేసి కడుపునింపుకునేవాళ్లం. ఒకటో తరగతిలో మా నాన్న పార్డి(బి) ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు.
ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు అక్కడే చదువుకున్న నేను పాఠశాల సెలవు దినాల్లో పార్డి నుంచి అజ్జర్‌వజ్జర్‌కు పన్నేండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతం నుంచి కాలినడకన ఇంటికి వెళ్లేవాడిని. సెలవు దినాల్లో పొలంలో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడిని. ఐదో తరగతిలో బోథ్ మండలంలోని పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బోథ్ మండల కేంద్రంలో ఎస్టీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.
ఇంటర్‌లో ఉట్నూర్‌లోని గిరిజన గురుకుల లాల్‌టేక్డి కళాశాలలో సీటు వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం చదువుతుండగా, 1987లో ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామరావు గిరిజన ఆదివాసీలకు కేటాయించిన వెయ్యి పోస్టుల్లో నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. 1988లో అజ్జర్‌వజ్జర్ పంచాయతీ పరిధిలోని మాధుగూడ గ్రామంలో ఉపాధ్యాయుడిగా వృత్తిలో చేరాను. ఏడు సంవత్సరాలు అక్కడే పని చేసి ఎనిమిదో సంవత్సరంలో బజార్‌హత్నూర్ మండలంలోని కొత్తగూడ పాఠశాలలకు బదిలీ అయింది.
అక్కడ సంవత్సరం పాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఆసిఫాబాద్‌లోని అల్లిగూడ పాఠశాలలో ఆరు నెలల పాటు పని చేశాను. ఆ తర్వాత ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో స్పోర్ట్స్ పాఠశాలకు బదిలీ అయ్యింది. 1989లో ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కోసుగూడ అనుబం«ధ గ్రామానికి చెందిన భారతీబాయితో వివాహమైంది. నాకు వెంకటేష్, మహేష్ ఇద్దరు కుమారుతో పాటు కృష్ణవేణి అనే కూతురు ఉంది. ఈ ముగ్గురు కూడా ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు.
ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఉద్యమం వైపు
బాల్యం నుంచి ఆదివాసీలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయేవాణ్ణి. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తూనే వచ్చాను. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూనే ఆదివాసీల ఐక్యత కోసం పని చేశాను. 1992లో బోథ్ మండలానికి చెందిన భారతీబాయి అనే ఆదివాసీ వివాహిత మహిళపై అప్పట్లో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో బోథ్ డివిజన్ తుడుందెబ్బ కన్వీనర్‌గా ఆదివాసీలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలతో ప్రస్థానం ప్రారంభించాను. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు పోలీసుల తీరును ఖండించాయి. దీంతో ఉద్యమ ప్రస్థానం మొదలై నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తోంది.
చిన్ననాటి స్నేహితులతో..
అప్పట్లో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకున్న చిన్ననాటి స్నేహితులున్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ మనోహర్, ప్రకాష్, దత్తు, రవి అనే స్నేహితులు నాకు ఇప్పటికీ కూడా కలుస్తుంటారు. ఉద్యమం, రాజకీయాల్లో ఇంత బీజీగా ఉన్నప్పటికీ స్నేహితులతో ఇప్పటికీ కలిసి మాట్లాడుకుంటాం.
పిల్లల పెంపకం బాధ్యత ఆమెదే..
కొన్నేళ్లుగా ఉద్యమం, రాజకీయాల్లో నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటాను. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకుంటుంది. కొన్నిసార్లు నెలల తరబడి కూడా ఇంటికీ వెళ్లడానికి అవకాశం దొరికేది కాదు. దీంతో పిల్లలు, ఇంటి వ్యవహారాలు అంతా భార్య భారతీబాయి చూసుకోవడంతో ఇప్పుడు మా ఆవిడే నాకు బలమైంది. నాకు అధ్యాత్మికరం అంటే ఇష్టం దేవుళ్లను నమ్ముతా. ఇంటి దైవం జంగుబాయి ఆశీర్వాదం ప్రతి రోజు తీసుకుంటా. శివుని సన్నిధిలో కూడా కొంత సమయాన్ని వెచ్చిస్తా.
Comments
Please login to add a commentAdd a comment