తాండూరు: సారా తరలిస్తున్న ఓ ఆటోను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం..
తాండూరు: సారా తరలిస్తున్న ఓ ఆటోను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన రాథోడ్ గణేష్, రాథోడ్ గోపాల్‌లు తండా నుంచి (ఏపీ 28 డబ్ల్యూ 5131) ఆటోలో బుధవారం సారా తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు మదనంతాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.
సారా తరలిస్తున్న ఆటోను సీజ్ చేసి రాథోడ్ గణేష్, రాథోడ్ గోపాల్‌ను అరెస్టు చేశారు. ఆటోలో తరలిస్తున్న 600 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన విజయమ్మ ఇంటికి సారా ప్యాకెట్‌లు తీసుకువెళ్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. విజయమ్మ పరారీలో ఉందని సీఐ తె లిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సహదేవ్, సిబ్బంది పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ నాయకురాలి రిమాండు
జవహర్‌నగర్: స్థానిక అంబేద్కర్‌నగర్‌లో మద్యం అక్రమంగా విక్రయిస్తున్న జవహర్‌నగర్ టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అబ్బగోని పుష్ప ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. మేడ్చల్ ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ కథనం ప్రకారం.. శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ లో కొంతకాలంగా టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అబ్బగోని పుష్ప మద్యం అక్రమంగా విక్రయిస్తుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈమేరకు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించిన పోలీసులు ఆమె ఇంట్లోంచి 30 ప్యాకెట్ల సారా ప్యాకెట్లు, 80 విస్కీ క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.