
సాక్షి, హైదరాబాద్: కరోనా అనగానే టక్కున మదిలో మెదిలేది చైనాలోని వూహాన్ నగరం.. ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది మృతికి కారణమైన వైరస్ ఇక్కడి నుంచే బయలుదేరింది. దాని పుట్టుకలో చైనా చెప్తున్న మాటలను ప్రపంచం పచ్చి అబద్ధాలుగా కొట్టిపడేస్తోంది. గతంలో సార్స్ కూడా చైనా నుంచే మొదలై ప్రపంచ దేశాలని ఆందోళనకు గురి చేసింది. వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని అమెరికా గట్టిగా చెప్తుండగా, ఇతర ప్రధాన దేశాలు దాన్ని ఖండించటం లేదు.
ప్రపంచం మొత్తాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఈ వైరస్ ఎలా వెలుగుచూసిందో విచారణ జరగాలనే దేశాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో.. అసలు చైనా భూభాగాన్ని వేదికగా చేసుకుని వైరస్‌లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ క్రమంలో.. తొలి అంటువ్యాధి మశూచి విషయంపై చాలా మంది దృష్టి పడింది. ఈ వైరస్‌ను వేగంగా ప్రపంచానికి చైనానే అంటించిందన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
3100 సంవత్సరాలకు క్రితమే..
మశూచి పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం గజగజ వణుకుతుంది. చరిత్రలో అంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిన మరో అంటువ్యాధి లేదు. 20వ శతాబ్దంలో ఏకంగా 50 కోట్ల మందిని ఈ వ్యాధి పొట్టనపెట్టుకుంది. మరి దీని పుట్టుక ఎప్పుడో తెలుసా.. ఇతమిత్థంగా ఆధారాలు లేనప్పటికీ దాదాపు 3100 సంవత్సరాల క్రితమే దీనికి మనుగడ ఉన్నట్టు తేలింది. అంతకు కొన్ని శతాబ్దాల క్రితం నుంచే ఆ వ్యాధి ఉందన్న అభిప్రాయాలున్నా.. ఆధారాలు లేవు. కానీ, క్రీ.పూ.1122లో చైనాలో దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు వెలుగు చూశాయి. అప్పటికే చైనాలో ఈ వ్యాధి బలంగా ప్రబలి ఉంది. వెరసి మశూచి చైనాలోనే పుట్టిందనే భావన చరిత్రకారుల్లో వ్యక్తమైంది.
అయితే, ఇది చైనాలో పుట్టలేదని, ఈజిప్టులో పుట్టి అక్కడి నుంచి చైనాకు చేరిందన్న చరిత్రకారులూ ఉన్నారు. ఎక్కువమంది చైనాకు ఇది బయటి నుంచే వచ్చిందని చెప్పారు. కానీ, అప్పటికే చైనాలో నాగరికత బాగా విలసిల్లుతూ జనాభా పెరుగుతున్నక్రమం కావటంతో, చైనాలో దీని బారిన పడ్డవారి సంఖ్య విపరీతంగా ఉందనేది కొందరు చరిత్రకారుల మాట. అప్పటికే చైనా వర్తకవాణిజ్యాలను ఇతర దేశాలకు విస్తరించటం ప్రారంభించింది. ఈ క్రమంలో చైనా నుంచి ప్రస్తుతం జపాన్, కొరియా, కంబోడియా తదితర ప్రాంతాలకు, తర్వాత భారత్‌కు విస్తరించినట్టు చెబుతారు. ఆ సమయంలో జపాన్‌లో ఒక్కసారిగా వ్యాధి ప్రబలి మూడింట ఒక వంతు జననష్టం జరిగిందని చెబుతారు.
ఈజిప్టు మమ్మీ మొహానికి మచ్చలు..
ఈజిప్టులో ఉన్న మమ్మీ సంస్కృతి మశూచి విషయంలో కొన్ని అనుమానాలు రేకెత్తించింది. క్రీ.పూ.1156లో చనిపోయిన ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి శవాన్ని మమ్మీగా మార్చారు. కొన్నేళ్ల క్రితం ఈ మమ్మీపై పరిశోధనలు జరిపి మొహం భాగంలో మచ్చలున్నట్టు గుర్తించారు. అవి మశూచి మచ్చలే అయి ఉంటాయని అంచనాకొచ్చారు. కానీ కచ్చితంగా నిర్ధారించలేదు. దీంతో ఈజిప్టు నుంచే చైనాకు మశూచీ పాకిందని చెబుతారు. కానీ, ప్రపంచానికి వేగంగా ప్రబలేలా చైనానే కారణమైందని చెబుతారు. చైనాతో వాణిజ్య సంబంధాలున్న దేశాలన్నింటికి మశూచి వేగంగా సోకింది. విస్తృతంగా ప్రబలింది. అప్పట్లో వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో ముగ్గురు చనిపోయేవారు.
20 శతాబ్దంలో బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది, భారత్‌లో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది, జర్మనీలో 50 వేల మంది.. ఇలా చనిపోయేవారు. 1796లో బ్రిటిష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ టీకాను కనిపెట్టిన తర్వాత కేసుల సంఖ్య కొంత తగ్గుతూ వచ్చింది. అయితే తొలుత ఆ వ్యాక్సిన్‌ను ప్రపంచం యావత్తు వ్యతిరేకించటంతో కొంతమందే వాడారు. చివరకు 1967లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం చేసుకోవటంతో వ్యాక్సిన్ విస్తృతంగా వాడి ప్రపంచం మశూచీని జయించింది. 1980లో ఇక మశూచీ క్రిమి అంతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
చిట్ట చివరి మశూచి కేసు..
ప్రపంచంలో చిట్ట చివరి మశూచి (వరియోలా మైనర్ వైరస్)కేసు 1975లో బంగ్లాదేశ్‌లో నమోదైంది. రహీమా బాను అనే మూడేళ్ల బాలిక మశూచీ బారిన పడి కోలుకుంది. చిట్ట చివరి మశూచి మృతి 1978లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ మెడికల్ మైక్రోబయోలజీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి జెనత్ పార్కర్ మశూచి బారిన పడి మృతి చెందింది.
చరకసంహితలో ప్రస్తావన..
వ్యాధులు, వైద్యానికి సంబంధించి చరకసంహితలో ఎన్నో విషయాలు వేల ఏళ్ల క్రితమే నమోదై ఉన్నాయి. క్రీ.పూ.3వ శతాబ్దంలోనే ఇందులో మశూచి ప్రస్తావన ఉంది. మసురిక అంటూ పేర్కొన్న విషయం మశూచికి సంబంధించిందనే అంటారు. మన దేశానికి తూర్పు భాగం నుంచి ఈ వ్యాధి ప్రబలి ప్రవేశించిందని ఆ పుస్తకంలో ఉందని చరిత్రకారులు విశ్లేషిస్తారు. వెరసి చైనా నుంచే ఈ వ్యాధి ప్రబలిందని చాలామంది బలంగా నమ్ముతారు.