నగరానికి చెందిన పియానో వాయిద్యకారుడు టీఎస్‌సతీశ్‌కుమార్ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక వేగంతో పియానో వాయించి సరికొత్త రికార్డు సృష్టించారు. నిమిషం వ్యవధిలోనే 1,999 నోట్స్ వాయించి జాతీయ రికార్డు నెలకొల్పారు.
జూబ్లీహిల్స్: వరల్డ్ రికార్డ్స్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఫిబ్రవరిలో నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో గుజరాత్‌కు చెందిన పియానో విద్వాంసుడు అమన్ బాట్ల నిమిషం వ్యవధిలో 1,208 నోట్స్ వాయించాడు. దీనిని సతీశ్‌కుమార్ బద్దలుకొట్టాడు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన సతీశ్ తండ్రి జయప్రకాష్ ఉపాధ్యాయుడు. ఇక్కడే పుట్టి పెరిగిన సతీశ్... ఉస్మానియాలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, మద్రాస్ యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తి చేశారు. కొంతకాలం ప్రభుత్వ లెక్చరర్‌గా పనిచేశారు. మ్యూజిక్ మీదున్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసి ఈ రంగంలోకి ప్రవేశించారు.
ఇవీ ఘనతలు...
సంగీత ప్రపంచంలో లండన్‌లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి నుంచి సర్టిఫికెట్ సాధించడం సంగీతకారులకు ఒక స్వప్నం. ఇలాంటి ఘనతను సతీశ్ సాధించారు. ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలో 8వ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్లు పొందారు. పియానో, ఎకోస్టిక్ డ్రమ్స్ వాయిద్యాలు వాయించి 8వ డబుల్ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించారు. భారత సంగీత సామ్రాట్టులుగా పేరొందిన ఇళయరాజా, ఏఆర్ రెహమాన్‌లు సైతం సింగిల్ గ్రేడ్ మాత్రమే సాధించడం గమనార్హం.
త్వరలో డాక్టరేట్...
‘ప్రస్తుతం వెస్ట్ మారేడ్‌పల్లిలో కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ నిర్వహిస్తున్నాను. 200 మందికి పైగా విద్యార్థులు నా దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాను. కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ నుంచి ఏప్రిల్ 25న డాక్టరేట్, త్వరలో గుజరాత్‌లో జరిగే కార్యక్రమంలో ఇండియన్ జీనియస్ అవార్డు అందుకోబోతున్నాను. నా శ్రీమతి విజయ కూడా సంగీతం శిక్షణ పొందారు. స్కూల్‌లో పాఠాలు చెబుతూ నాకు సహకరిస్తోంద’ని చెప్పారు సతీశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment