
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి ఫలితాలు వచ్చా యో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అలాంటి ఫలితాలే వస్తాయని బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకునేవి కాబట్టి ఇందులో టీఆర్‌ఎస్ ఎంపీలు ఓడినా, గెలిచినా ప్రజలకు లాభం లేదన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరం లేదని, మోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణ ప్రజలు మరోసారి మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోందన్నారు.
పాతబస్తీలో మెట్రో ప్రారంభం కాకపోవడానికి కేసీఆర్, ఒవైసీనే కారణమన్నారు. కేసీఆర్ అభివృద్ధి అంతా గ్రాఫిక్స్‌లోనే ఉంటుందన్నారు. శవాల చుట్టూ గద్దలు తిరిగినట్లు ప్రధాని కుర్చీ చుట్టూ విపక్ష నేతలు తిరుగుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ పచ్చి అబద్దాలు మాట్లాడారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ కాలేదన్నారు. పైగా అక్కడ రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి డబ్బు లేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమో లేక రద్దు చేయడమో చేయాలన్నారు. రేపు కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా టీఆర్‌ఎస్‌లోకి పోవడం ఖాయమన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment