సర్వీస్ యాక్ట్ రావాలి: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఐ చట్టం లాగానే సర్వీస్ యాక్ట్ రావాల్సి ఉందని, అప్పుడే ఆర్టీఐ చట్టం ఉద్దేశం నెరవేరుతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహారాష్ట్రలోని విధానాన్ని ఇక్కడ అమలు చేయాల్సి ఉందని చెప్పారు. ఆర్టీఐ యాక్ట్‌ను సమర్థవంతంగా అమలు పర్చటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం వార్షిక సదస్సు (సమాచార హక్కు వారోత్సవాలు) నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘సమాచార హక్కు చట్టం అమలులో సమిష్టి బాధ్యత’ అనే అంశంపై పలువురు వక్తలు ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు తమకెందుకులే అనుకుంటే ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేదని, ప్రజలు తలచుకుంటేనే వ్యవస్థ మారుతుందని చెప్పారు. ‘తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. ఎవరినైనా నిలదీసి అడిగే సత్తా ఉంది’ అని అన్నారు. ఆర్టీఐ లాంటి చట్టాలు రాష్ట్రాభివృద్ధిలో భాగంకావాలని ఆకాంక్షించా రు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్టీఐ అమలులో ఇన్ఫర్మేషన్ కమిషన్‌ది ముఖ్యపాత్రని తెలిపారు. చట్టంలో పేర్కొన్న విధంగా అధికారులు, సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సమాచార కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు.
గచ్చిబౌలిలో ఆర్టీఐ భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా కేసులు పరిష్కరించేమార్గం కోసం ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా తనని నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అని, దానికి పోలీసు శాఖ గౌరవం ఇచ్చి, దరఖాస్తులకు వెంటనే సమాచారం అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, ఆర్టీఐ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.