పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి, సేవాభావంతో పనిచేయాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ వై.గంగాధర్ సూచిం చారు. శుక్రవారం జడ్చర్ల శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో 5వ బ్యాచ్‌లో శిక్షణ
జడ్చర్ల: పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి, సేవాభావంతో పనిచేయాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ వై.గంగాధర్ సూచిం చారు. శుక్రవారం జడ్చర్ల శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో 5వ బ్యాచ్‌లో శిక్షణ ముగించుకున్న సివిల్ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి డీఐజీ వై.గంగాధర్‌తో పాటు కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ పి.విశ్వప్రసాద్, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ డీటీసీలో తొమ్మిది నెలల పాటు పొందిన శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలోఎదురువుతున్న సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు. పోలీసుశాఖ పరువు, ప్రతిష్టలు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లపైనే ఆధారపడి ఉంటుందన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు నేరాల అదుపునకు శాయశక్తులా కృషి చేయాలన్నారు. ఎన్నో ఇబ్బందులతో పోలీసుల దగ్గరకు వచ్చే ప్రజలను గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమాజంలో పోలీసుల ను సునాయసంగా గుర్తించే అవకాశం ఉందని, అటు ప్రజలు ఇటు మీడియా పోలీసుల ప్రవర్తనను గమనిస్తుంటారని పేర్కొన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీసులు అన్ని విషయాల్లో సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. విధినిర్వహణలో అజాగ్రత్త, నిర్లక్ష్యం తగదన్నారు.
అంకితభావం, మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణతో ప్రజలకు సేవలందించి, పోలీసు శాఖకు ఖ్యాతి తీసుకురావాలని కోరారు. కలెక్టర్ ప్రియదర్శిని మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్ర కీలకమైందని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ధర్నాలు, తదితర ఆందోళనల సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం పోలీసులకు లభించడం గొప్ప అదృష్టమన్నారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని, ఎల్లప్పుడూ విధి నిర్వహణలో భాగస్వామ్యంగా ఉండాలన్నారు.
ఇటీవల షాద్‌నగర్‌లో తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లారని ఆందోళన చెందిన ఓ తల్లి గుండెపోటుతో మృతి చెందిందని గుర్తు చేశారు. ప్రజలతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. వ్యామోహాలకు గురై అవినీతికి పాల్పడవద్దని, నిజాయితీగా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పదో బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, డీటీసీ ప్రిన్స్‌పల్ మల్లారెడ్డి, డీఎస్పీలు బాలకోటి, కృష్ణమూర్తి, చెన్నయ్య, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.