ఎన్‌కౌంటర్ చంద్రబాబు | Seshachalam event launches must pay the price | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్ చంద్రబాబు

Published Thu, Apr 16 2015 2:17 AM | Last Updated on Mon, Oct 8 2018 8:39 PM

ఎన్‌కౌంటర్ చంద్రబాబు - Sakshi

ఎన్‌కౌంటర్ చంద్రబాబు

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ధ్వజం
* శేషాచలం ఘటనకు బాబు మూల్యం చెల్లించక తప్పదు
* రెండు రాష్ట్రాల్లో జరిగినవీ బూటకపు ఎన్‌కౌంటర్లే

సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్ ఘట నకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదనిడమజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మంగళవారం అర్ధరాత్రి నగరంలోని ఖిల్వత్ మైదానంలో యునెటైడ్ ముస్లిం ఫోరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

20 మంది కూలీలను కాల్చి చంపి బూటకపు ఎన్‌కౌంటర్ కథ అల్లుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఆయన నారా చంద్రబాబు కాదని, ఎన్‌కౌంటర్ చంద్రబాబు అని అభివర్ణించారు. ఉమ్మడి రాష్ట్రం లో బాబు అధికారంలో ఉన్నప్పుడు 2,002 బూట కపు ఘటనలను ప్రోత్సహించి తగిన మూల్యం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. బాబు పరిపాలనకు సమర్థుడు కాదని, ఆయన్ను గద్దె దించిన ఘనత యునెటైడ్ ముస్లిం ఫోరందేనని ఆయన గుర్తు చేశారు. ముస్లిం లను జిహాది పేరుతో, దళితులను స్మగర్ల పేరుతో హతమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
 
సిట్‌ను అంగీకరించబోం..
ఆలేరు ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం వేసిన సిట్‌ను అంగీకరించబోమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆలేరు ఘటనపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను కలసి కోరితే ఆయన పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ సందీప్ శాండిల్యపై తమకు నమ్మకం లేదని, గతంలో మక్కా మసీదు బాంబు పేలుడు ఘటన సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులపై ఆయన ముస్లిం యువకులకు వ్యతిరేకంగా తప్పుడు నివేదిక సమర్పించారని అన్నారు.

మరోవైపు ప్రభుత్వ కార్యదర్శి జారీ చేసిన సిట్ జీవోలో మృతి చెందిన వారిని తీవ్రవాదులుగా పేర్కొన్నారని, వారిని కోర్టు శిక్షించనప్పుడు తీవ్రవాదులని ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన 17 మంది పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  
 
ముస్లింల వినాశనానికి మోదీ కుట్ర
ప్రధాని మోదీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటూ... ముస్లింల వినాశనానికి పాల్పడుతున్నాడని అసదుద్దీన్ దుయ్యబట్టారు. ముస్లింల చరిత్రను మోదీ తెలుసుకోవాలని, ముస్లింలతోనే ప్రపంచం.. ప్రపంచంతోనే ముస్లింలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement