
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో భాగంగా న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారుల కోటా నుంచి ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టుకు హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన కొలీజియం ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైంది. కొలీజియం పంపిన ఏడుగురు న్యాయాధికారుల జాబితా కేంద్రానికి కూడా చేరింది.
కొలీజియం సిఫారసు చేసిన న్యాయాధికారుల్లో విశాఖపట్నం ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జిల్లా జడ్జి బొడ్డుపల్లి శ్రీ భానుమతి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి పి.శ్రీసుధ, సీబీఐ కోర్టుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి మటం వెంకటరమణ, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చిల్లకూర్ సుమలత, గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి హరిహరనాథశర్మ, తూర్పు గోదావరి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి ఎన్.తుకారాంజీ ఉన్నారు. ఈ పేర్లతో పాటు న్యాయవాదుల కోటా నుంచి వెళ్లిన ఏడుగురు న్యాయవాదుల పేర్లకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను కేంద్రానికి పంపగా, ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా తన అభిప్రాయాలను పంపలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment