
రాణిపేటలో దస్తగిరి కుటుంబానికి షర్మిల పరామర్శ
మహబూబ్నగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర పాలమూరు జిల్లాలో మూడో రోజు బుధవారం కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అకస్మిక మరణం తట్టుకోలేక రాణిపేటలో మృతి చెందిన దస్తగిరి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. దస్తగిరి కుటుంబ సభ్యులు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకువచ్చారు.
షర్మిల అంతకుముందు పెంట్లపల్లిలోని లచ్చమ్మ కుటుంబాన్ని, చిట్యాలలో మణెమ్మ కుటుంబాలను పరామర్శించారు. షర్మిల ఈ రోజు పర్యటనలో భాగంగా నందిన్నెలో నరసింహరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే గోవర్థనగిరి, జమ్మిచేడు, గద్వాల్, ధరూర్లలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడాన్ని తట్టుకోలేక చనిపోయిన బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకే షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం (08-12-2014) పాలమూరు జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.