
అభిమానులకు తమన్నా అభివాదం చేస్తుండగా షూ విసురుతున్న కరీముల్లా
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు.
నగల షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరీముల్లా.. తమన్నాపైకి షూ విసిరాడు. అయితే అది ఆమెకు కొంతదూరంలో పడింది. అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. కరీముల్లా.. ఎందుకు బూటు విసిరాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సాయంత్రం కొండాపూర్‌లో మరో మలబార్ నగల దుకాణాన్ని తమన్నా ప్రారంభించనుంది.
కాగా, ఇటీవల ఖమ్మంలో పర్యటించిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా చెప్పు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు.