ధర్నాచౌక్ వద్ద దీక్షలో కోదండరాం, ఆర్.కృష్ణయ్య తదితరులు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆగిపోదని, భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోత తప్పదని పలువురు నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, హక్కులకై పార్టీలకతీతంగా జెండాలు పక్కనపెట్టి బీసీలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలను చైతన్యం చేయా లని బీసీ సంఘాలు, కుల సంఘాలను కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపును నిరసిస్తూ తెలంగాణ జన సమితి బీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహా రదీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్తున్న సీఎం, పంచాయతీ ఎన్ని కల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 34% రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% దాటవద్దనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎవరి సంఘం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప బీసీలను సంఘటితం చేద్దా మనే చిత్తశుద్ధి కనబడడంలేదని వాపోయారు.
టీజే ఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ తగ్గింపు పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాదని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్నారు. రిజర్వేషన్లు ఆత్మగౌరవ హక్కుగా గుర్తించి దాన్ని కాపాడుకునేందుకు బీసీలు ఉద్యమించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, మంత్రివర్గం లేకుండానే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం శోచనీయమన్నారు. కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్య త్వ రద్దుపై రూ. 50 లక్షలు ఖర్చుచేసి, పెద్దపెద్ద అడ్వొకేట్లతో కోర్టులో వాదించిన ప్రభుత్వం రిజర్వేష న్ల తగ్గింపుపై మాత్రం స్థానిక అడ్వొకేట్‌లతోనే సరిపె ట్టిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్‌పైనే తొలి సంతకం చేయడం ద్రోహం చేయడమేనన్నారు.
ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గం: దాసోజు
కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ దళితులు సామాజిక అంటరానితనానికి గురవుతుంటే, బీసీలు రాజకీయ అం టరానితనానికి గురవుతున్నారన్నారు. అసెంబ్లీలో, అఖిలపక్షంతో, కుల, బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఎందుకుండకూడదని అన్న కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయమన్నారు. సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వినయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకురాలు ఝాన్సీ, టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, కె.దిలీప్‌కుమార్, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment