సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34 శాతం నుంచి 54 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. శుక్రవారం బీసీ భవన్‌లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి జూపల్లి చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, చట్ట పరమైన అవరోధాలు లేవని తేల్చి చెప్పారు. సకలజనుల సర్వే, ఇటీవల ప్రభుత్వం జరిపిన జనాభా లెక్కల ప్రకారం బీసీలు 54 శాతం ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పల్లె గోడల మీద రాసిన విషయం గుర్తులేదా అని ధ్వజమెత్తారు. రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్, మెరిట్ లేదని వివరించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, కోట్ల శ్రీనివాస్, కె.నర్సింహగౌడ్, వన్నాడి రమ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment