హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి
ఇబ్రహీంపట్నం: అవినీతి నిర్మూలన, పారదర్శకమైన పాలన కొనసాగినప్పుడే అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. సమాచారహక్కు చట్టంపై ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత జీవనం కోసం పౌరులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తీవ్రమైన విఘాతాలుగా ఉన్న అవినీతి, బంధుప్రీతిని తరిమివేసేందుకే సమాచార హక్కును చట్టంగా తీసుకురావడం జరిగిందన్నారు.
చట్టం చేసి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా అవినీతి కుంభకోణాలు ఇంకా కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన సమాజాభివృద్ధి, అవినీతి రహిత సమాజం కోసం పౌరుల ఆలోచనా సరళిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలు, ధనికులు అన్న వ్యత్యాసం అంతరిస్తేనే సామాజిక న్యాయమనే అర్థం పరిపూర్ణం అవుతుందన్నారు. సమాచారహక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు చేసుకున్నవారికి సదరు అధికారి గడువులోపు సమాచారం అందజేయకుంటే శిక్షార్హులు అవుతారని అన్నారు. వారికి రూ.10 వేలు, ఆపై జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
ఇదే కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యార్ సంతాపసభను నిర్వహించారు. రాజ్యాంగానికి లోబడి కృష్ణయ్యార్ వెల్లడించిన తీర్పులు సంచలనాలకు మారుపేరుగా నిలిచాయని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున, భారత న్యాయవాదుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు కేవీ కృష్ణారావు, ప్రధాన కాార్యదర్శి ప్రభాకర్, ఉస్మానియా లా కళాశాల ప్రొఫెసర్ బిబి రెడ్డి, బార్ అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, న్యాయవాదులు పి.రాములు, ఉదయశంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
Published Sun, Dec 14 2014 11:34 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement