ఇబ్రహీంపట్నం : కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్, వీఆర్వోలు సోమవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రాజేశ్వరరావుపేట, మేడిపల్లి గ్రామాల ఇన్‌చార్జ్ వీఆర్వో కరికె రమేష్‌ను తొలుత ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహశీల్దార్ ముద్దం శంకరయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు... అప్సర్ పాషా తండ్రి రాజమహమ్మద్ వీఆర్‌ఏగా పనిచేస్తూ రెండేళ్ల క్రితం మరణించారు.
దీంతో తండ్రి ఉద్యోగం తనకు ఇప్పించాలని అప్సర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు వీఆర్వో రమేష్ లంచం డిమాండ్ చేయడంతో అప్సర్ పాషా ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం అప్సర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తహశీల్దార్ శంకరయ్యకు పాత్ర కూడా ఉందని వీఆర్వో వెల్లడించడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు.