మరో ఎస్సై ఆత్మహత్య | SI prabhakar reddy commit suicide in quarters | Sakshi
Sakshi News home page

మరో ఎస్సై ఆత్మహత్య

Published Thu, Jun 15 2017 2:16 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

మరో ఎస్సై ఆత్మహత్య - Sakshi

మరో ఎస్సై ఆత్మహత్య

► రివాల్వర్‌తో కాల్చుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి
►గతంలో రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి
►పోలీస్‌స్టేషన్‌ వద్ద బంధువులు, సన్నిహితుల ఆందోళన
►ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఎస్సై భార్య ఆరోపణ
►తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్‌టీవీ ఓబీ వ్యాన్‌ దహనం
►గజ్వేల్‌ ఏసీపీ బదిలీ.. విచారణాధికారిగా అదనపు డీజీపీ గోపీకృష్ణ
 

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో పది నెలల కింద ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం మరువకముందే.. ఆయన స్థానంలో వచ్చిన ఎస్సై పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి (34) బుధవారం బలన్మరణానికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని తన క్వార్టర్‌లోనే కణతపై రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారుల వేధింపులే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమంటూ బంధువులు, సన్నిహితులు ఆందోళనకు దిగడంతో కుకునూర్‌పల్లి అట్టుడికింది.

కానిస్టేబుల్‌గా చేసి..
ఎస్సై పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు. ఆయనకు ఏడాదిన్నర కిందే వివాహమైంది. భార్య రచన, ఐదు నెలల బాబు ఉన్నారు. ఆయనకు ఇద్దరు సోదరులు. వారిలో సంజీవరెడ్డి హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తుండగా.. భాస్కర్‌రెడ్డి టంగుటూరులో పాల కేంద్రం నడుపుతున్నారు. తొలుత కానిస్టేబుల్‌గా ఎంపికైన ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో కొన్నేళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం 2012లో ఎస్సైగా ఎంపికయ్యారు. మల్కాజిగిరి, శామీర్‌పేట, కౌడిపల్లి పోలీస్‌స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. 2016 ఆగస్టులో కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. 15 రోజులకు అక్కడికి బదిలీ అయ్యారు.

కొబ్బరినీళ్లు తెమ్మని చెప్పి..
నాలుగు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి భార్య రచన పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉంటున్నారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌లో రూల్‌కాల్‌ నిర్వహించి.. తిరిగి క్వార్టర్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత గజ్వేల్‌లో ఉన్న కానిస్టేబుల్‌ మురళికి ఫోన్‌ చేసి తనకు కొబ్బరి నీళ్లు తీసుకుని రావాలని సూచించారు. మురళి ఉదయం 11 గంటల సమయంలో కొబ్బరినీళ్లు తీసుకుని ఎస్సై క్వార్టర్‌ వద్దకు వచ్చారు. గడియపెట్టి ఉండడంతో కొంతసేపు తలుపు తట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీ నుంచి చూడగా.. రక్తపుమడుగులో పడి ఉన్న ఎస్సై కనిపించారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా.. గజ్వేల్, సిద్దిపేట ఏసీపీలు గిరిధర్, నర్సింహారెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. కొంతసేపటికి సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శివకుమార్‌ వచ్చి సంఘటన వివరాలు సేకరించారు.

బంధువులు, స్నేహితుల ఆందోళన
ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య విషయం దావాన లంలా వ్యాపించడంతో ప్రభాకర్‌రెడ్డి తల్లి వెంకటమ్మ, బంధువులు, సన్నిహితులతో పాటు పెద్ద సంఖ్యలో జనం పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని.. గతంలో రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాక కూడా పరిస్థితిలో మార్పు లేదని ఆగ్రహిస్తూ ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట రాజీవ్‌ రహదారిపై బైఠాయించారు. వారికి మద్దతుగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేశారు. ప్రభాకర్‌రెడ్డి మృతికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, ఆయన సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోతే దానిని అధికారులు మాయం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సూసైడ్‌ నోట్‌ను బయటపెట్టే వరకు ఆందోళన విరమించబోమంటూ భీష్మించారు. గజ్వేల్‌ ఏసీపీ, సిద్దిపేట సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో రాజీవ్‌ రహదారిపై కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి.

ఉన్నతాధికారుల వేధింపులే కారణం
‘‘ఉన్నతాధికా రుల వేధింపులే నా భర్త ఆత్మహత్యకు కారణం. పైఅధికా రులు టార్చర్‌ చేస్తు న్నారని, ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకుంటున్నానని కొన్ని రోజుల నుంచి నా భర్త చెబుతున్నాడు. గజ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ తరచూ ఇబ్బంది పెడుతున్నాడని కూడా చెప్పేవాడు. ములుగు పోలీస్‌స్టేష న్‌కు బదిలీపై వెళ్లే అవకాశం వచ్చిందని.. ఉన్నతాధికారులు కొద్దిరోజులు ఉండాలని చెప్పడంతో ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పా డు. ఇప్పుడీ దారుణం జరిగిపోయింది..’’
                   – ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన

గజ్వేల్‌ ఏసీపీపై బదిలీ వేటు..
విచారణాధికారిగా అదనపు డీజీపీ గోపీకృష్ణ
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనకు సంబంధించి గజ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌పై వేటు పడింది. ఆయనను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో పాటు ఉన్నతాధికారుల వేధింపులు, శిరీష వ్యవహారం.. ఇలా అన్నింటిపై పూర్తి విచారణ జరిపేందుకు అదనపు డీజీపీ గోపికృష్ణను విచారణాధికారిగా నియమించారు. అయితే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులు కాకుండా ఇతర కారణాలు ఉంటే.. బదిలీ ఎందుకు చేశారన్న చర్చ జరుగుతోంది.

ఇదే పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య సమయంలో అప్పటి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌పై బదిలీ వేటు పడింది. అయితే రామకృష్ణారెడ్డి తన సూసైడ్‌ నోట్‌లో డీఎస్పీ వేధింపులను స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గజ్వేల్‌ ఏసీపీ వేధింపులే ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎస్సై ఆత్మహత్య విషయం తెలిసినా రెండు గంటల వరకు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం వల్లే ఏసీపీపై బదిలీ వేటు పడేలా చేసిందని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అభిప్రాయపడ్డారు.

ఎన్‌టీవీ ఓబీ వ్యాన్‌ దహనం
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఉన్నతాధికారుల వేధింపుల వల్ల చనిపోతే.. టీవీ చానళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌ ముందు ఉన్న ఎన్‌టీవీ ఓబీ వ్యాన్‌పై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. డీజిల్‌ ట్యాంకు పగలగొట్టి నిప్పంటించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు డీజీ గోపీకృష్ణ, జేసీ పద్మాకర్, గజ్వేల్, సిద్దిపేట ఆర్డీవోలు విజయేందర్‌రెడ్డి, ముత్యంరెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాత్రి 9.30 గంటల సమయంలో తీవ్ర ఉద్రిక్తత మధ్య ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని కుకునూర్‌పల్లి నుంచి సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ప్రభాకర్‌రెడ్డి మృతికి గజ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఎస్సై సోదరుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 174 సెక్షన్‌ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement