
సారూ..మా సమస్యలు పరిష్కరించండి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూ సమస్యలు,
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఉపాధి తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజేసీ వెంకట్రావు, డ్వామా పీడీ సునందరాణిలకు వినతిపత్రాలు సమర్పించారు.
- రాంనగర్
జీవనోపాధి కల్పించాలి
నాకు పుట్టుకుతోనే చెవుడుతో పాటు మూగ కూడా ఉంది. నేను పీజీ పూర్తి చేశా. చెవిటివాడిని అనే కారణంతో నన్ను ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఎలాంటి ఉపాధిలేక జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. మా తల్లిదండ్రులకు నన్ను పోషించే స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. నాకు ఏదైనా ఉపాధి మార్గం చూపించాలి.
- ఎస్‌కే నాగుల్ మీరా, రామన్నగూడెం,
ఆత్మకూర్ (ఎస్) మండలం
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు..
ఆదుకోవాలి
నా భర్త రాజు టీఆర్‌ఎస్ నేరేడుచర్ల మండల కార్యదర్శిగా కొంతకాలం పనిచేశాడు. ఉద్యమకారులను సమైక్యాంధ్రలో అణచివేస్తూ లాఠీచార్జిలను చూసి తెలంగాణ రాదేమోనని 2010లో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. నాకు ఇద్దరు పిల్లలు. వీరు 7వ తరగతి, 4వ తరగతి చదువుతున్నారు. కూలీ, నాలీ పనిచేస్తే వచ్చే డబ్బు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అమరవీరుల కుటుంబాలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
- రేగళ్ల ఉమ, నేరేడుచర్ల
ఉపాధిహామీ కూలీలకు న్యాయం చేయాలి
మా గ్రామంలో ఉపాధిహామీ పథకంలో పని చేసే కూలీలకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఒక్కో కూలీకి రోజుకు 149 రూపాయలు మం జూరు చేస్తుండగా స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ కేవలం 70 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. తక్కువ కూలి విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిలదీస్తే ఆయన కుటుంబ సభ్యులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న మాకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి.
- మురళి, కె.శ్రీకాంత్, కేశరాజుపల్లి