సాక్షి, కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మహబూబాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి విషయమై రాజకీయవర్గాలు, టీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ టికెట్ తనకే వస్తుందని సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ధీమాగా ఉన్నారు. గత డిసెంబర్‌లో మానుకోటలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీతారాంనాయక్‌ను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో టికెట్ తనదేననే ధీమాతో సీతారాంనాయక్ ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందులో కీలకమైన పినపాక, భద్రాచలం, ఇల్లెందు, జయశంకర్ జిల్లాలోని ములుగు స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది.
ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారా అనే అంశంపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నాయి. కాగా గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వస్తుందనుకున్న ఎంపీ టికెట్ కోల్పోయిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రామచంద్రు సైతం ఈసారి మహబూబాబాద్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రామచంద్రుకు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. గత ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని, ఈసారి అవకాశం పొందాలని రామచంద్రు ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ అధికారి అయిన రామచంద్రు ఒడిశాలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పైగా ఢిల్లీలో పలువురు ఐఏఎస్‌లతో సత్సంబంధాలు ఉండడంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అనేక సానుకూల ఫలితాలు రాబట్టారు. రామచంద్రు వల్లే ఢిల్లీలో సీఎం కేసీఆర్ పలుకుబడి మరింతగా పెరిగింది.
రాష్ట్రానికి సంబంధించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ క్లియరెన్సులు, బీటీపీఎస్‌కు అనుమతులు, 3,100 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా చేయిండంలో రామచంద్రు ఢిల్లీలో సక్సెస్ అయ్యారు. అలాగే 26 దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ వేదికలపై దేశ వాణి వినిపించారు. నీతిఅయోగ్, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో రామచంద్రు ఎంపీ టికెట్ ఆశిస్తుండడంతో కార్యకర్తల్లో ఆసక్తి పెరిగింది. కాగా, జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లలో గత కొన్ని నెలలుగా ఆయన పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రామచంద్రుకు ఘనస్వాగతం పలికారు.
పోటాపోటీగా క్షేత్రస్థాయి పర్యటనలు..
లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఆశావహులు క్షేత్రస్థాయిలోకి మరింతగా చొచ్చుకెళుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి విస్తృతంగా ఉండడంతో ఇప్పటికే పర్యటనల వేగం పెంచారు. ఈ లోక్‌సభ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో భద్రాద్రి జిల్లానే అత్యంత కీలకమైనది కావడంతో ఇక్కడి సెగ్మెంట్లలో పర్యటనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మానుకోట పార్లమెంట్ పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం శాసనసభ సెగ్మెంట్లు ఉన్నాయి. నర్సంపేట సెగ్మెంట్ వరంగల్ రూరల్ జిల్లాలో, ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్లు మహబూబాబాద్ జిల్లాలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఇల్లెందు, భద్రాచలం, పినపాక సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలోనే మూడు సెగ్మెంట్లు ఉండడంతో ఇదే కీలకం కానుంది. దీంతో ఇక్కడే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment