వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియాను ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండేది యువతే. దేశ రాజకీయాలను మార్చే శక్తి కూడా యువతకే ఉంది. అలాంటి యువత దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు సామజిక మాద్యమాలను తమ ప్రధాన ప్రచార వేదికగా మలుచుకుంటున్నాయి. గతంలో ఎన్నికల ప్రచారం అంటే జెండాలు, వాల్‌పోస్టర్‌లు, కటౌట్‌లు, కరపత్రాలు, ప్రచార వాహనాలు ఎక్కువగా కనిపించేవి. కానీ కాలం మారింది. రాజకీయ నాయకులకు ఇప్పటికీ వాటి అవసరం ఉన్నప్పటికీ వాడకం ఎంతగానో తగ్గింది.
ఇందుకు ప్రధాన కారణం సోషల్‌మీడియానే. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి. కూర్చున్న చోటనుంచే ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నడిపించే సాధనాలు అందుబాటులోకి ఉన్నాయి. తాము చెప్పాలనుకున్నది వేగంగా, స్పష్టంగా ఇతరులకు చేరవేయడంలో సోషల్‌మీడియా ఎంతో ప్రధానపాత్ర పోషిస్తుంది. అందుకే రాజకీయపార్టీలు ఈ సోషల్‌మీడియాపై దృష్టిసారించాయి. జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సమరానికి సంబంధించి ఆయా రాజకీయపార్టీలు పెట్టే ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నె(ట్)ట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇంటర్నెట్ వాడకం తెలియని లీడర్లు సైతం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు.
సాక్షి,ఆర్మూర్/కామారెడ్డిక్రైం: ఎన్నికల్లో యువతను ఆకట్టుకొని వారి ఓట్లు కొల్లగొట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించాలనుకున్న అభ్యర్థులు తమ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించారు. పట్టణ యువతను, విద్యార్థులను, సీనియర్ సిటిజన్‌లను, ఉద్యోగులను, మహిళలను, వ్యాపారస్తులను, కార్మికులను ఎవ్వరినీ వదలకుండా వారి ఓట్లను తమ విజయానికి వారధులుగా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రతీ అవకాశాన్ని వినియోగించుకునే పనిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
స్మార్ట్ ఫోన్‌ల పుణ్యమాని నేటి యువత సోషల్ నెట్‌వర్క్ సైట్‌లను అధికంగా ఉపయోగించుకోవడాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సెల్ ఫోన్‌లలో యువత అత్యధికంగా ఉపయోగించే ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రాం అప్లికేషన్లను ఉపయోగించుకుంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి నిలవనున్న అభ్యర్థులు తాము పోటీ చేసే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాలను వివరిస్తూ సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. తమ బయోడేటాను మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసుకుంటూ లైక్స్, షేరింగ్, కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
మార్మోగుతున్న స్మార్ట్‌ఫోన్‌లు..
తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని వివరించడమే కాకుండా ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు తయారు చేసిన వీడియోలు ఇప్పటికే వాట్సప్, ఫేస్‌బుక్‌లలో రావడం చూస్తున్నాం. ఇవేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలతో మాట్లాడిస్తూ తీసిన వీడియోలు వస్తున్నాయి. వారు ఎవరికి ఓటు వేస్తారు, ఫలానా పార్టీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెబుతూ, అవసరమైతే ఇతర పార్టీలను తిడుతూ ఓటర్లు మాట్లాడినట్లుగా తయారు చేసిన వీడియోలు ఇటీవల స్మార్ట్‌ఫోన్‌లలో మారుమోగుతున్నాయి. 18 నుంచి 39 వయస్సు గల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. యువతే రానున్న ఎన్నికల్లో ఫలితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం అందిరిక తెలిసిందే. యువ ఓటర్లను ఆకర్షించేందుకే పార్టీలు సోషల్ మీడియా ద్వార ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న ఎన్నో పోస్టింగ్‌లు నిబంధనలకు విరుద్దంగా ఉంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నకిలీ పోస్టింగ్‌లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పార్టీల ప్రధాన అస్త్రంగా..
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో అన్ని విభాగాలతో పాటు ఐటీసెల్ విభాగాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఐటీ సెల్‌ల పాత్ర కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఫొటోలు, వీడీయోలను తమకు అనుకూలం అయ్యే విధంగా తయారు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు. రాజకీయ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలకు దిగడం, ఏకంలో తిట్టుకోవడం, ప్రతి విమర్శలు చేసుకోవడం చూస్తున్నాం.
అంతేగాకుండా సర్వే ఫలితాల పేరిట ఎన్నో పోస్టింగ్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలంగా సర్వే ఫలితాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ టీఆర్‌ఎస్‌కు ఫొటోలతు, వీడీయోలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ వైఫల్యాలు, టీఆర్‌ఎస్ నాయకులపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌కు అనుకూలంగా రూపొందించిన ఫొటోలు, వీడియోలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడంలో బీజేపీ సైతం ముందుబాటలోనే ఉందని చెప్పవచ్చు. పార్టీల ఐటి విభాగాలకు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో కార్యవర్గాలను సైతం ఏర్పాటు చేసి ఫొటోలు, వీడీయోలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలంటు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment