సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో పనిచేస్తూ సివిల్ కానిస్టేబుల్, ఎస్సైలుగా ఎంపికైన వారికి కొత్తగా వేతన కష్టాలు చుట్టుముట్టాయి. పదోన్నతి దక్కినందుకు సంబరపడాలో వేతనం తగ్గుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎస్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో ఒకేసారి దాదాపు 18 వేల పోస్టుల ఫలితాలు ప్రకటించింది. వీరిలో 1,200 మంది ఎస్సైలకు శిక్షణ ప్రారంభమైంది.
త్వరలోనే 16 వేల మందికి పైగా కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది. అయితే సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్సైలకు ఎంపికైన కానిస్టేబుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల టీఎస్‌ఎస్‌పీఆర్‌బీ నిర్వహించిన పరీక్షల్లో ఆర్మ్‌డ్ రిజర్వుడు (ఏఆర్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) బలగాల్లో పనిచేసే కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరిలో 2016 అంతకుముందు ఎంపికైనవారున్నారు. ఆ లెక్కన వీరందరి జీతం రూ.30 వేలకు కాస్తా అటుఇటుగా ఉంది.
పాత కొలువులకు రాజీనామా చేసి..
ఇటీవల వెలువడిన ఫలితాల్లో దాదాపు 1,500 మంది ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు సివిల్ కానిస్టేబుళ్లు, ఎస్సైలుగా ఎంపికయ్యారు. వీరంతా సివిల్‌కు రావాలంటే వీరంతా తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి, సంబంధిత విభాగం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకురావాలి. అప్పుడు వీరంతా తిరిగి కానిస్టేబుల్, ఎస్సై శిక్షణకు వెళతారు. శిక్షణకాలంలో వీరందరినీ ట్రైనీ కేడెట్లుగానే పరిగణిస్తారు. ఆ సమయంలో నెలకు రూ.9,000 స్టైపెండ్ కింద ఇస్తారు. వీరిలో చాలామంది వివాహితులు. కొందరికి పిల్లలు కూడా ఉన్నారు. శిక్షణకాలంలో ఇంత తక్కువ వేతనంతో ఎలా మనగలగాలి? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వీరిలో ఎస్సైకి ఎంపికైన అభ్యర్థులు ర్యాంకు పెరిగింది కాబట్టి.. ఎలాగోలా సర్దుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ, సివిల్‌కానిస్టేబుల్‌కు ఎంపికైన ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లు మాత్రం కుటుంబపోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు. తామందరం ఇప్పటికే శిక్షణ తీసుకుని, కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న కారణంగా తిరిగి 9 నెలల సుదీర్ఘ శిక్షణ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గతంలో 2016లో నూ ఇలాంటి సమస్యే ఎదురైనపుడు ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, కానిస్టేబుళ్లకు కేవలం 3 నెలల తరగతులు బోధించి వెంటనే సివిల్ కానిస్టేబుళ్లుగా పోస్టింగ్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. తమకు తిరిగి అదే వెసులుబాటు కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు పలువురు కానిస్టేబుళ్లు డీజీపీ కార్యాలయానికి వస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment