సోనియా సభ ప్రతిష్టాత్మకం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో గెలుపుకోసం ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదివారం చేవెళ్లలో జరుగనున్న ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ ఎత్తున జనసమీకరణ ద్వారా గెలుపు బరిలో తామే ముందున్నామని చాటుకునేందుకు సర్వశక్తులొడ్డుతోంది. అమ్మ ఆశీస్సులతోనే తెలంగాణ సాధ్యమైందని ఊరువాడా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ఈ సభతో సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేవెళ్లలో నిర్వహించ తలపెట్టిన అధినేత్రి సభకు లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలోనే శుక్రవారం సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి పార్టీ శ్రేణులను జనసమీకరణకు పురమాయించారు. ప్రచారపర్వం ముగింపు వేళ నిర్వహిస్తున్న ఈ సభను సక్సెస్ చేస్తే ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం పడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా సోనియమ్మ ప్రసంగం కేడర్‌లో నూతనోత్తేజం నింపుతుందని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ జరిపే బాధ్యతను దిగువశ్రేణి నాయకులకు అప్పగించింది.
మరీ ముఖ్యంగా పశ్చిమ రంగారెడ్డిపై దృష్టి సారించింది. గ్రామీణ నియోజకవర్గాలు కావడంతో ఇక్కడినుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలను రప్పించవచ్చని అంచనా వేస్తోంది. అదేరోజు చేవెళ్ల, తాండూరు, పరిగి తదితర ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తున్నందున మేడమ్ సభను సవాలుగా స్వీకరించాలని ద్వితీయశ్రేణి నేతలకు పార్టీ నాయకత్వం సూచించింది. మరోవైపు స్టార్ క్యాంపెయినర్లు లేక డీలా పడ్డ శ్రేణులకు అధినేత్రి ప్రసంగం టానిక్‌లా పనిచేస్తుందని అభిప్రాయపడుతోంది. ఇటీవల టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్లలో సభ నిర్వహించడం.. దీనికి భారీగా జనం తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం వెల్లివిరుస్తోంది.
రాష్ట్ర పర్యటనలో భాగంగా 27న మెదక్ జిల్లా ఆందోల్‌లో జరిగే ఎన్నికల ప్రచారానికి సోనియా వస్తున్నారు. వాస్తవానికి షెడ్యూల్‌లో ఆ రోజు ఈ సభనే ఉన్నప్పటికీ, అధిష్టాన ంపై ఒత్తిడి తెచ్చిన కార్తీక్‌రెడ్డి చేవెళ్లలో సభ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇక్కడ కూడా సోనియా సభ నిర్వహణకు అనుమతించింది. టీపీసీసీని ఒప్పించి ఖరారు చేయించుకున్న అధినేత్రి సభను అదేస్థాయిలో విజయవ ంతం చేయాలని, ఏమాత్రం తేడా వచ్చినా బాగుండదని భావిస్తున్న సబిత ఫ్యామిలీ జనసమీకరణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.