త్వరలో ఓరుగల్లు ‘జూ’కు చిరుత
సిద్ధమవుతున్న చిరుత ఎన్‌క్లోజర్
వీటితోపాటే జంగిల్ క్యాట్, కసోరియా
దసరా నాటికి ప్రారంభమయ్యే అవకాశం
వరంగల్ మినీ జూకు కొత్త అందాలు
హన్మకొండ : పక్షుల కిలకిలలు, జింక పిల్లల గెంతులకే పరిమితమైన వరంగల్ జూలో ఇకపై పులి గాండ్రింపులు వినపించనున్నాయి. వరంగల్ జూ పార్కుకు వచ్చే సందర్శకులు మరికొద్ది రోజుల్లో చిరుత పులిని ప్రత్యక్షంగా చూడొచ్చు. వివిధ రకాల పక్షుల, జింకలతో మొదలైన వరంగల్ వన విజ్ఞాన కేంద్రం ప్రస్థానం చిరుతపులి రాకతో జూ పార్కు స్థాయి సైతం పెరగనుంది.
దసరా నాటికి సిద్ధం
రానున్న కొద్ది రోజుల్లో మన జూ పార్కు సరికొత్త అటవీ అందాలు సంతరించుకోనుంది. దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, మొసళ్లు, హంసల వంటి జంతుజాలం సరసన ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే చిరుతపులి జూ పార్కులో సందడి చేయనుంది. ఈ మేరకు జూ పార్కులో ఎన్‌క్లోజర్ సైతం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర జూ అథారిటీలు ఎన్‌క్లోజర్‌ను పరిశీలించాక దసరా పండుగనాటికి చిరుతపులి గర్జనలు జూ పార్కులో వినిపిస్తాయి. చిరుతపులితో పాటు జంగిల్‌క్యాట్(అడవి పిల్లి), కోసోవరిలేదా రియో పక్షల(నిప్పుకోడిని పోలి ఉండే ఆఫ్రికా పక్షులు) కోసం జూ పార్కులో ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
విస్తరించనున్న జూ పార్కు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వరంగల్ మినీ జూ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో జూపార్క్‌గా అప్‌గ్రేడ్ చేయాలంటూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ స్మాల్ జూ పార్కు ప్రస్తుతం 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతమిక్కడ దుప్పులు, సాంబర్ జింకలకు ప్రత్యేకంగా పార్కులు ఉండగా కొండ గొర్రెలు, ఎలుగుబంటి, నెమళ్లు, రామచిలకలు, పావురాలు, నిప్పుకోళ్లకు ఎన్‌క్లోజర్లు ఉన్నాయి. త్వరలో చిరుతపులితో పాటు జంగిల్‌క్యాట్, కచావర్ రానున్నాయి. పెద్దపులి, తెల్లపులి, తోడేలు, ఏనుగు, పగ్‌డీర్, బార్కింగ్ డీర్, హైనా, అడవిపంది తదితర జంతువులకు సంబంధించిన ఎన్‌క్లోజర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవసరమైతే ప్రస్తుతం జూ పార్కుకు అనుకుని చుట్టు పక్కల అందుబాటులో ఉండే స్థలాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
దసరా నాటికి సిద్ధం
-గంగారెడ్డి(డీఎఫ్‌ఓ, వైల్డ్‌లైఫ్ వరంగల్)
చిరుతపులి, కోసవరి, జంగిల్‌క్యాట్‌ల కోసం కొత్తగా ఎన్‌క్లోజర్ల నిర్మాణం పూర్తి కావొస్తుంది. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత జూ అథారిటీ అధికారులు ఎన్‌క్లోజర్లను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల నుంచి ఈ మూడు జంతువులను ఒక్కో జత వంతున వరంగల్ జూకు తీసుకొస్తాం.