అమ్మో.. పెద్ద పులి
ఎన్‌క్లోజర్ నుంచి బయటకు దూకిన రాయల్ బెంగాల్ టైగర్
హైదరాబాద్: బోనులో బుద్దిగా ఉండాల్సిన ఓ పెద్ద పులికి ఏమైందో ఏమో... 10 అడుగుల ఎన్‌క్లోజర్ పైనుంచి దూకేసి ఒక్కసారిగా బయటకు వచ్చింది. జూ పార్కులో కలియతిరుగుతూ మరో ఎన్‌క్లోజర్ వైపు అడుగులు వేసింది... అప్పుడు ఆ ఎన్‌క్లోజర్‌లో ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. జూ సిబ్బంది సమ్మర్ హౌజ్‌లో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్ కదంబా (5) ను సంతానోత్పత్తి కోసం కరీనా అనే ఆడ పులి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో 10 అడుగులు ఉన్న ఆ ఎన్‌క్లోజర్ పైనుంచి కదంబా పులి ఒక్కసారిగా బయటికి దూకింది. అక్కడి నుంచి తనను రోజూ ఉంచే ఎన్‌క్లోజర్ ద్వారం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో జూ సిబ్బంది తిలక్, మహేశ్‌లు ఉన్నారు. పులిని చూసిన వెంటనే వారు అప్రమత్తమై లోపలే ఉండి ఎన్‌క్లోజర్‌కు తాళం వేసుకున్నారు.
సమాచారాన్ని వెంటనే జూ అధికారులకు తెలియజేశారు. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జూ లో ఉన్న సందర్శకులను బయటకు పంపించారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని పులిపై మత్తు మందును ప్రయోగించారు. మత్తులోకి జారుకున్న పులిని వెంటనే పాత ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లారు. అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎన్‌క్లోజర్‌లోనే ఉన్న తిలక్, మహేశ్‌లను బయటికి తీసుకొచ్చారు. అయితే ఎన్‌క్లోజర్ నుంచి బయటకొచ్చిన పులి తన సమీపంలోని మౌస్ డీర్, సరిసృపాల జగత్తు, మొసళ్ల ఎన్‌క్లోజర్‌ల వద్ద ఉండే జనాల వైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జంతువుల మార్పిడిలో భాగంగా 2010 లో కదంబా పులిని మైసూర్‌లోని మంగళూర్ జూ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. కదంబా పులితో క్రాసింగ్ చేయిస్తున్న ఎన్‌క్లోజర్‌ను ఇటీవల నిర్మించారు. ఈ ఎన్‌క్లోజర్ 10 అడుగులే ఉంది. విశాలమైన స్థలం లేకపోవడంతో క్రాసింగ్‌కు అవకాశం లేని కారణంగా చిర్రెత్తిన పులి ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని జూ సిబ్బంది భావిస్తున్నారు.
సంతానోత్పత్తి కోసమే పంపాం: సంతానోత్పత్తి కోసమే కదంబా పులిని మరో ఎన్‌క్లోజర్‌లోకి పంపామని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ పి.కె. శర్మ తెలిపారు. ఎన్‌క్లోజర్ నుంచి పులి బయటికి రావడంపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. సంతానోత్పత్తి కోసం తీసుకొఢచ్చిన పులి బయటికి వచ్చినా.. సిబ్బంది అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్‌క్లోజర్ల వద్ద జూ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ సూచిం చారు. పులిని సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోకి తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.