
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అనుమతులు త్వరితగతిన జారీ చేసేందుకు ప్రత్యేక విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర గనుల శాఖ అధికారులు, రాష్ట్రంలోని జియోసైన్స్ సంస్థల ప్రతినిధులతో గురువారం జరిగిన వార్షిక వ్యూ హాత్మక ముఖాముఖి సమావేశం (అసిమ్)లో ఆయన మాట్లాడారు. అటవీ, పర్యావరణ అనుమతులు జారీ చేస్తున్న తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులకు మైనింగ్ అనుమతులు సత్వరం జారీ చేయాలన్నారు. దీనికోసం కన్సల్టెన్సీ సేవలు అందించాలని సీఎస్ సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సమావేశాన్ని తెలంగాణలో కేంద్ర గనుల శాఖ నిర్వహించడాన్ని అభినందించా రు. రాష్ట్రంలో గనుల అభివృద్ధి, ఖనిజాన్వేషణకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేంద్ర గనుల శాఖ పరిధిలోని జియోసైన్స్ పరిశోధనా సంస్థల సహకారంతో తెలంగాణలో ఖనిజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
అసిమ్ తరహా ఎంతో ఉపయోగం
హైదరాబాద్‌లో ఉన్న జియో సైన్స్ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేందుకు అసిమ్ తరహా సమావేశాలు ఉపయోగపడుతాయని కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), అటమిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) వంటి సం స్థల సహకారంతో ఖనిజాన్వేషణ వేగవంతం గా చేపట్టవచ్చన్నారు. తెలంగాణలో సున్నపురాయి, మాంగనీస్, ఐరన్‌ఓర్, బొగ్గు తదితర ఖనిజాల అన్వేషణ పనులు చేపడతామన్నారు.
రూ.4,792 కోట్ల ఆదాయం
రాష్ట్రంలో 3,291 మైనింగ్ లీజులుండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,792 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గనులశాఖ జాయింట్ డైరక్టర్ రఫీ అహ్మద్ వెల్లడించారు. స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వా రా ఖనిజాల అన్వేషణ చేపట్టడంతోపాటు కేం ద్ర జియోసైన్స్ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందినట్లు టీఎస్‌ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ వెల్లడించారు. తమ సంస్థకు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు నాలుగు ప్రాజెక్టులు కేటాయించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment