డాక్టర్ రాజు రమేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆ దేశ జనాభా 11 కోట్లు.. అక్కడి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు 450.. ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి పోను, కరోనా బాధితుల కోసం కేటాయించినవి కేవలం 54 మాత్రమే. ఇలాంటి తరుణంలో ఆ వైరస్ విజృంభిస్తే పరిస్థితేంటి..? ఇది ఆఫ్రికా దేశం ఇథియోపియా ముందున్న భయం. సమస్య పెరిగితే తట్టుకోవటం కష్టం. అందుకే సమస్యను ఉన్నంతలో కట్టడి చేయాలని నిర్ణయించింది. అసలే అతి చిన్న ఆర్థిక వ్యవస్థ.. లాక్‌డౌన్ చేస్తే మరింత చితికిపోతామన్న ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించింది. కేవలం అవసరమున్నవారు తప్ప మిగతావారు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. బయటకు వచ్చిన వారు గుమి కూడకుండా కనీసం మీటరుకు ఒకరు చొప్పున దూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు గుర్తించి జనం కూడా సహకరించటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 65 మాత్రమే.
ప్రజలు క్రమశిక్షణగా ఉన్నారు..
‘భౌతిక దూరం పాటించటం ఒక్కటే కరోనాను నియంత్రించే మంత్రం. ఇప్పుడు ఇథియోపియా జనం అదే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాన్ని పాటించటంలో క్రమశిక్షణ చూపుతున్నారు. ఈ పేద దేశాన్ని ఆ క్రమశిక్షణే గట్టునపడేస్తుందని మేం నమ్ముతున్నాం’అని డాక్టర్ రాజు రమేశ్‌రెడ్డి చెప్పారు. అర్బా మించ్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన.. కరోనాను ఎదుర్కొనేందుకు ఇథియోపియా అనుసరిస్తున్న తీరును ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కరోనాను సకాలంలో నియంత్రించలేక అల్లకల్లోలమవుతోంది. మరి అమెరికా లాంటి దేశాల ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చే పేద ఇథియోపియా తట్టుకోగలదా.. అందు కే మార్చి తొలివారంలోనే అక్కడి ప్రభుత్వం మేల్కొంది.
సరిహద్దులను మూసేసింది, విమానాలను రద్దు చేసింది. రాజధాని నగరం అడిస్ అబాబాలో కఠిన ఆంక్షలు విధించింది. కేసుల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఇప్పటికీ లాక్ డౌన్ విధించలేదు. కానీ విద్యాసంస్థలు మూసేసి, అవకాశం ఉన్న వారందరినీ ఇంటి నుంచే పనిచేయమని పురమాయించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. వాహనా ల్లో సీటుకు ఒకరే కూర్చోవాలని, ఆటోరిక్షాల్లో ఇద్ద రు మాత్రమే ఉండాలని ఆదేశించింది. ఇక ప్రజ ల్లో అవగాహన కోసం 35 వేల మందితో బృందా లు ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూసి ఆందోళన లో ఉన్న జనం ఆ నిబంధనలను బాగా పాటిస్తున్నారు. స్వీయ నియంత్రణతో క్రమశిక్షణగా ఉంటున్నారు.
ఒక్కరోజే 8 కేసులు.. హెల్త్ ఎమర్జెన్సీ
రాజధాని నగరంలో 44 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు పెరిగి ఆ సంఖ్య 52కు చేరుకుంది. దీంతో ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 4 కేసులు మాత్రమే రాజధాని ఆవల ఉన్నాయి. ఇప్పటివరకు రాజధానిలోనే ఉన్న కఠిన ఆంక్షలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. దేశమంతటా ప్రజల్లో క్రమశిక్షణ కనిపిస్తున్నందున సమస్యను పెరగకుండా చూసే అవకాశముంది.
ఇంజీరాతో రోగనిరోధక శక్తి
ఇథియోపియా ప్రజల సంప్రదాయ ఆహారం ఇంజీరా. గసాల ఆకారంలో ఉండే మిల్లెట్ (టెఫ్) పిండితో తయారు చేసే ఈ ఆహారం అక్కడి ప్రజల రోగ నిరోధకశక్తిని బాగా పెంచుతోంది. ఎన్నో వ్యాధుల నుంచి వారికి ఇది రక్షణగా ఉంటుంది. 80% గ్రామీణ జనాభాతో ఉండే ఈ దేశంలో కాలుష్యం చాలా తక్కువే. వెరసి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇప్పుడు కరోనాను కూడా వారి శరీరం తట్టుకునే అవకాశముంది. ఇటు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇథియోపియా జనాన్ని చూసైనా భారతీయులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి కుదుటపడే అవకాశముంది. అయితే భారత్‌తో పోలిస్తే మేం చాలా ధైర్యంగా ఉన్నామని డాక్టర్ రాజు రమేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment