► ఆయన పేరు నర్సింహారావు. రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారి. దాదాపు 55 ఏళ్లుంటాయి. ఆయనకు రెండు నెలల కిందట కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ల సూచన మేరకు బలవర్ధక ఆహారం తీసుకుంటున్నారు. నిత్యం డ్రైఫ్రూట్స్, మాంసాహారం, గుడ్లు, చేపలు, పండ్లు వంటివి తింటున్నారు. దీంతో ఈ రెండు నెలల్లోనే ఆయన అదనంగా 17 కేజీల బరువు పెరిగారు. దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఇప్పుడు మథనపడుతున్నారు.
► ఆమె పేరు నమిత... 35 ఏళ్లుంటాయి. హైదరాబాద్‌లో ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. గతంలో ప్రతీ రోజూ ఉదయం జిమ్‌కు వెళ్లేవారు. లాక్‌డౌన్‌లో జిమ్‌లు మూతపడటంతో వ్యాయామం ఆగిపోయింది. పైగా రోగనిరోధక శక్తి పెరగడానికి బలవర్ధకమైన ఆహారం తీసుకున్నారు. ఫలితంగా 15 కేజీల బరువు పెరిగారు. దీంతో ఆమెకు మోకాళ్ల నొప్పులు కూడా ప్రారంభమయ్యాయి.
- సాక్షి, హైదరాబాద్
కరోనా కాలంలో ఇల్లు కదల్లేదు. ఒంటికి శ్రమలేదు. బలంగా ఉండాలని బాగా తినేశారు. బరువెక్కారు. ఇప్పుడు పెరిగిన పొట్టలు చూసుకొని బావురుమంటున్నారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయనే ఆందోళనతో ‘సన్న’బడాలని ఆరాటపడుతున్నారు. అసలే తెలంగాణలో ఊబకాయుల సంఖ్య అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సర్వే తేల్చిచెప్పగా, దానికితోడు కరోనా లాక్‌డౌన్ తర్వాత వారి సంఖ్య మరింత పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఎక్కువమంది ఇంటికే పరిమితమయ్యారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సహా వివిధ రంగాల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. కరోనా కాలంలో రోగనిరోధక శక్తి కోసం బలవర్థకమైన, అధిక కేలరీల ఆహారం తీసుకున్నారు. వ్యాయామం లేకపోవడంతో పొట్ట బెలూన్‌లా మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారిలో 40 శాతం మంది అధికబరువుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నిపుణులను సంప్రదించకుండా... మార్కెట్ మాయలో పడుతున్నారు. ఎవరికి తోచిన డైట్‌ను వారు ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ‘ఉచిత’సలహాలను పాటించి రకరకాల ప్రయోగాలకు దిగుతున్నారు.
కొబ్బరి నూనె... బుల్లెట్ కాఫీ
అధిక బరువును తగ్గించేందుకు మార్కెట్లో అనేక పద్ధతులంటూ ఊదరగొడుతున్నారు. వివిధ రకాల ప్రకటనలతో మాయ చేస్తున్నారు. వీటిలో అశాస్త్రీయ పద్దతులు ఎక్కువగా ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నూనె తాగమని కొందరు చెబుతున్నారు. బుల్లెట్ కాఫీ అనేది మరొకటి ఉంది. కాఫీలో వెన్న వేసుకొని తాగడం. అలాగే హెర్బల్ ఆధారిత ఉత్పత్తులు వచ్చాయి. ఏవో రసాయన పదార్థాలు కలిపేస్తారు. అవి తీసుకుంటే బరువు తగ్గుతారని ప్రచారం చేస్తున్నారు. వీటివల్ల రక్తపోటు పెరగడం, కిడ్నీలు ఫెయిల్యూర్ అవడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇక కీటోడైట్ అనేది మరొకటి... ఇందులో ఎక్కువ కొవ్వున్న పదార్థాలు తినాలి. కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు తక్కువ తీసుకోవాలి. ఇది అందరికీ సరిపడదని వైద్యులు అంటున్నారు. మరోటి ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్. అంటే రోజుకు 16 గంటలు ఏమీ తినకుండా ఉండటం. మిగిలిన 8 గంటల మధ్యే ఆహారం తీసుకోవడం ద్వారా మిగిలిన సమయంలో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. కానీ దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. పైగా ఇది అందరికీ సరిపడదు. లైపోసెక్షన్ వల్ల బాడీõÙప్ మారుతుందే కానీ బరువు తగ్గదని నిపుణులు అంటున్నారు.
అశాస్త్రీయ పద్ధతులతో అనర్థాలు
కరోనా తర్వాత బరువు తగ్గిస్తామంటూ అనేక వ్యాపార ప్రకటనలు వచ్చాయి. అశాస్త్రీయ పద్ధతుల వల్ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆస్పత్రిలో చేరిన వారున్నారు. కృత్రిమ డైట్ ప్లాన్‌లతో కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్ వచ్చిన వారున్నారు. షుగర్, కొలె్రస్టాల్ వంటి కేసులు పెరుగుతున్నాయి. కొందరిని ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాల్సి వచి్చంది. అందరికీ అన్నీ సరిపడవని గుర్తుంచుకోవాలి. డాక్టర్, డైటీíÙయన్ పర్యవేక్షణలోనే డైట్‌ను ఫాలో అవ్వాలి.
– డాక్టర్ రాకేశ్ కలపాల, డైరెక్టర్, ఒబెసిటీ సెంటర్, ఏఐజీ, హైదరాబాద్
లావెక్కితే సమస్యలెన్నో..
► ఊబకాయం వల్ల బుద్ధి మందగిస్తుంది. మెదడు పనితీరు తగ్గుతుంది.
► ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. రాత్రి పడుకున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది.
► కొవ్వు పెరిగి రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండె పోటు వచ్చే అవకాశముంది. గుండె కొట్టుకునే రేటులో హెచ్చుతగ్గులు వస్తాయి.
► ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. లివర్ సైజ్ కుంగిపోయి పనితీరు తగ్గుతుంది. క్లోమగ్రంధిలో కొవ్వు పెరిగి ప్రాంకెటైటిస్, ప్రాంకియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
► తేన్పులు, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. షుగర్, బీపీ పెరుగుతాయి. ఆస్తమా ఉంటే అది మరీ ఎక్కువవుతుంది.
► మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి.
► మానసిక వ్యాధులు, డిప్రెషన్ వంటివి కూడా వస్తాయి.
► ఆడవాళ్లలో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓడీ) సమస్యలు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment