రోటి..వెరైటీ | special story on roti and food | Sakshi
Sakshi News home page

రోటి..వెరైటీ

Published Thu, Oct 26 2017 9:21 AM | Last Updated on Thu, Oct 26 2017 9:21 AM

special story on roti and food

రుచుల సమ్మేళంలో విభిన్నత సిటీ ప్రత్యేకత. నగర వంటకాలు దేశంలోనే ఓ విశిష్టతను సంతరించుకున్నాయి. నవాబుల ఆహారపు అలవాట్లు ఇక్కడి ప్రజల జీవనశైలిలో ఇప్పటికీ భాగంగానే ఉన్నాయి. ఆ కోవకు చెందినవే రొట్టెలు. సిటీజనులు రోటీగా పిలిచే వీటికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రధానంగా పాతబస్తీ వారికి రోటీ తినందే దినచర్య ప్రారంభం కాదంటే అతిశయోక్తి కాదు. పాతబస్తీలోని ఎన్నో కుటుంబాలు తరతరాలుగా రొట్టెల తయారీతో ఉపాధి పొందుతున్నాయి. పోషకాల ఖజానాగా పేరొందిన రొట్టెలను లొట్టలు వేస్తూ ఇప్పటికీ ఎంతో మంది తింటున్నారు. వీటి రుచి అమోఘమంటూ కితాబు ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

చార్మినార్‌ పరిసరాల్లో వందల సంఖ్యలో రొట్టెల కార్ఖానాలు ఉన్నాయి. పురానీహవేలీ ప్రాంతంలోనే దాదాపు 30కి పైగా రొట్టెల తయారీ కేంద్రాలు ఉన్నాయి. నాన్, షీర్మాల్, కుల్చా, తందూరీ, రుమాలీ, వర్ఖీ రోటీ, పరాటా, పుల్క రొట్టెలకు మంచి గిరాకీ ఉంది. నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వివాహాది శుభకార్యాలకు ఇక్కడి నుంచే రొట్టెలు సరఫరా అవుతాయి.   

అల్పాహారంతో మొదలు..
మైదాపిండి, ఆటా, పెరుగు, పాల మిశ్రమాన్ని నాలుగు పలకలుగా తయారుచేసి ప్రత్యేకమైన బట్టీల్లో వేడి చేస్తారు. వీటికి నెయ్యి పూసి విక్రయిస్తారు. వీటిని పాతబస్తీలోని ఎన్నో కుటుంబాలు రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకుంటాయి. గొర్రె, మేక ఎముకలతో తయారు చేసిన నహారీ (సూప్‌)లో దీన్ని నంజుకుంటారు. మరికొందరు మధ్యాహ్నం నాన్‌ రొట్టెలను కబాబ్‌లతో తింటారు. ఒక్కోదాని ధర రూ.15. రోజుకు వెయ్యికి పైగా నాన్‌లు విక్రయిస్తున్నట్లు దుకాణా యజమాని ఖాజీ అబ్దుల్‌ హమీత్‌ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్‌లో వేలాది రొట్టెలు తయారు చేస్తామన్నారు.

రుమాలీ.. తినాలి
చార్‌ రుమాలీ.. ఏక్‌ తలాహువ (వేయించిన మాంసం) లావో.. అని యువకులు ఎక్కువగా ఆర్డర్‌ ఇస్తారు. రాత్రి వేళ డిన్నర్‌లో దీన్ని ఎక్కువగా తింటారు. మైందాపిండితో తయారు చేసిన ఈ రొట్టె పరిమాణంలో రుమాల్‌ అంత ఉంటుంది. కాగితం కంటే కూడా పల్చగా ఉంటుంది. మైదాతో పాటు కోడిగుడ్లు, పాలు, వెన్న మిశ్రమంతో రొట్టెలాగా తయారు చేసి నిప్పులపై  కాల్చుతారు. దీనిని సంపన్నులు విందు, వివాహాల్లో ఎక్కువగా వడ్డిస్తారు. ఒక్కోటి రూ.10.  

తందూరీ.. తినరా మైమరిచి..
పాతబస్తీలో ఏ హోటల్‌కు వెళ్లినా ఏక్‌ తందూరీ, మటన్‌ మసాలా లావో అనే మాటలే వినిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం హోటళ్లలో తందూరీ అందుబాటులో ఉంటుంది. మైదాపిండి, పాలు, మొక్కజొన్న పిండి మిశ్రమంతో తందూరీ రోటీ తయారు చేస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ శాతం మధ్యాహ్న భోజనంలో తందూరీని మటన్‌ లేదా చికెన్‌తో లాగించేస్తారు. ఒక్కో దాని ధర రూ.12.    

 వర్ఖీ .. వహ్వా
మటన్‌ గ్రేవీ లేదా చికెన్‌ గ్రేవీలతో కలిపి వర్ఖీ పరోటా తింటే ఆ రుచే వేరు. పాలు, మైదాపిండి, గుడ్డు, పెరుగు, ఉప్పు మిశ్రమంతో పెద్ద సైజులో రొట్టెలాగా తÐయారు చేసి నెయ్యిలో వేయిస్తారు. దీని రుచి కూడా భలేగా ఉంటుంది. ఎక్కువగా దీన్ని మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తింటారు. పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో ఎంతో మంది దీన్ని తినేందుకు పాతబస్తీకి వస్తుంటారు. ఇది కేవలం పాతబస్తీలోనే లభిస్తుంది. దీని ధర రూ.15.   

నాలుగు తరాలుగా..
నగరంలోనే తొలి నాన్‌ రోటీ దుకాణం మాదే. దీనిని 1851లో పురానీహవేలీలో మా ముత్తాత ప్రారంభించారు. నాలుగు తరాలుగా నాన్‌ రోటీ తయారు చేస్తున్నాం. నాన్‌ రోటీ మొగలాయి వంటకం. దీన్ని ఎక్కువగా షోర్వా (సూప్‌)తో తింటారు. గొర్రె కాళ్ల నహరీ (సూప్‌)ను ఎక్కువగా వర్షాకాలం, చలి కాలాల్లో ఆరగిస్తుంటారు.  
– ఖాజా అబ్దుల్‌ హమీద్‌ మున్షియి, నాన్‌ రోటీల తయారీదారుడు

తగ్గని ఆదరణ
చైనీస్, యురోపియన్, తాయి తదితర వంటకాలున్నా... పాతబస్తీలోని మొగలాయి వంటకాలకు మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ తందూరీ రోటీ, వర్ఖీ పరోటా, రుమాలీ రోటీ తదితర వంటకాలు అన్ని రోజుల్లోనూ తింటున్నారు. మొగలాయి రోటీలు ఎక్కువగా మటన్‌ ఫ్రై, చికెన్‌ గ్రెవీతో లాగించేస్తారు.  – మహమ్మద్‌ సలీం, హోటల్‌ మేనేజర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement