సంగారెడ్డి క్రైం: పేరుకే పెద్దాసుపత్రి.. ఇక్కడ వైద్య సేవలు అంతంతే... ఆపరేషన్ చేద్దామంటే మత్తు మందు ఇచ్చే డాక్టరే లేడు... పురిటి నొప్పులతో వచ్చే వారి బాధలు వర్ణణాతీతం... వసతులు అసలే లేవు... వైద్యులు, సిబ్బంది, బెడ్ల కొరత.. టాయిలెట్‌కు వెళ్లాలంటే క్యూ కట్టాలి... ఆరుబయటే చెట్ల కింద భోజనాలు.. స్ట్రెచర్లు, వీల్‌చైర్లు మూలకు.. పారిశుద్ధ్యం అధ్వానం.. ఇలా ఒకటేమిటి అన్నీ సమస్యలే.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అని ఎక్కడెక్కడి నుంచో వైద్యం కోసం నిరు పేదలు ఇక్కడికి వస్తుంటారు. తీరా వైద్యం అందక ఉసూరుమంటున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా ఆ మేరకు సేవలు, సౌకర్యాలు ఏ మాత్రం మెరుగు పడలేదు. మూడు దశాబ్దాల నాటి సేవలే ఇంకా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి స్థాయిని పెంచుతామని పాలకులు చెబుతున్నా ఆచరణలోకి రావడం లేదు. ‘సాక్షి’ మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించగా వెలుగు చూసిన వాస్తవాలివి..
మూడు దశాబ్దాల కిందట ప్రతి పాదించి ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాసుపత్రి ఇప్పటికీ అరకొర సౌకర్యాలతోనే కొట్టుమిట్టాడుతోంది. అప్పటికీ ఇప్పటికీ వంద శాతానికిపైగా పెరిగిన రోగుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలను పెంచకపోవడంతో రోగుల అవస్థలు వర్ణణాతీతం. నిత్యం వందల మందికి వైద్య సేవలందిస్తున్న సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాసుపత్రిని సాధ్యమైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకత వుంది. గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన దామోదర రాజనర్సింహ, ప్రభు త్వ విప్‌గా పనిచేసిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సంగారెడ్డి ఆసుపత్రిని సందర్శించి ఈ ఆసుపత్రిని కచ్చితంగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముందని హామీ ఇచ్చి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కే సీఆర్ మంత్రివర్గం లో డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రాజయ్య సైతం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఆయన కూడా ఆసుపత్రిలో ఉన్న రోగు ల సంఖ్య, డాక్టర్లు, అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శిం చిన వారంతా హామీలు ఇవ్వడం తప్పితే అమలుకు మాత్రం నోచుకోవడం లేదు.
ప్రతినెలా 450 డెలివరీలు...
ఈ ఆసుపత్రికి సంగారెడ్డి పట్టణ ప్రజలేగాక జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని మోమిన్‌పేట, శంకర్‌పల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రతినెలా 450 డెలివరీలు నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ప్రస్తుతం 250 పడకల ఆసుపత్రిగా ఉన్నా రోజూ ఇక్కడ 400 నుంచి 500 మంది వరకు ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. నెలకు 450 డెలివరీలు జరుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కేవలం 30 పడకలు మాత్రమే మంజూరు చేసింది. చాలాసార్లు బెడ్లు లేక కుటుంబ నియంత్రణ చేసుకున్న వారిని, డెలివరీకి వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి చికిత్స అందించిన సందర్భాలు ఈ ఆసుపత్రిలో వున్నాయి. మేల్ సర్జికల్ వార్డులో అధికారికంగా 30 బెడ్లు వుండాలి. కానీ రోగుల సంఖ్య ఎక్కువ ఉండ టంతో అధికారులు ఈ వార్డులో 50 బెడ్ల వరకు వేశారు. ఇదే పరిస్థితి ఫిమేల్ సర్జికల్ వార్డులో కూడా ఉంది. రోగులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వరండాలో కూడా బెడ్లు ఏర్పాటు చేశారు.
టాయిలెట్ల సమస్య..
నిబంధనల ప్రకారం పది మంది రోగులుండే వార్డుకు రెండు టాయిలె ట్లు ఉండాలి. కానీ 40 నుంచి 50 మంది రోగులున్న వార్డుల్లో నాలుగంటే నాలుగే టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లు సరిపోక రోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్‌పేషంట్ల కోసమే కాకుండా అవుట్ పేషంట్లకు కూడా సరిపోను టాయిలెట్లు లేవు. దాదాపు వెయ్యి నుంచి 1200 మంది వచ్చే ఆసుపత్రికి రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. రోగులు 50 మంది ఉంటే వారికి సహాయకులుగా మరో 50 మంది వరకు ఉంటారు. ఇలా వంద మందికి నాలుగు టాయిలెట్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలి యాలి. ఉదయం పూట క్యూ కట్టాల్సి వస్తుందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు.
వైద్యుల కొరత
ఆసుపత్రిలో ఉండాల్సినంత మంది వైద్యులు ఇతర సిబ్బంది కూడా లేరు. 13 మంది సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైనా ఇక్కడ కేవలం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆపరేషన్ సందర్భాల్లో అందుబాటులో ఉండాల్సిన అనస్తీషియా పోస్టు కూడా ఖాళీగా ఉంది. రేడియాలజిస్ట్, డెంటల్‌తోపాటు ఆర్‌ఎంఓ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆర్‌ఎంఓతోపాటు డీసీహెచ్‌ఎస్ పోస్టుల్లో ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. మూడు డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైతే ఒకే ఒక్క డాక్టర్ పనిచేస్తున్నారు. 18 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైతే వాటిలో 15 పోస్టులు భర్తీ అయ్యాయి.