హామీలు బారెడు.. కేటాయింపులు మూరెడు
- వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ధ్వజం
- ఈ బడ్జెట్‌తో తెలంగాణ ప్రగతి ఎలా సాధ్యమని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: హామీలు బారెడుంటే కేటాయింపులు మాత్రం మూరెడున్నాయని, ఈ అంకెల గారడీ బడ్జెట్ బంగారు తెలంగాణ కు ఎలా బాటలు వేస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అసెంబ్లీలో విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్ హామీలు బారెడు ఉంటే వాటి అమలుకు చేసిన కేటాయింపులు మూరెడు మాత్రమేనని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్‌లో భూముల అమ్మకం, కేంద్రం పన్నుల వాటా, గ్రాంట్ల ద్వారా వస్తాయని అంచనా వేసుకున్న మొత్తం రాన ప్పటికీ ఈసారి కూడా ఆయా పద్దులను భారీగా అంచనా వేయటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
దళితుల భూ పంపిణీ కోసం 1400 ఎకరాల భూమి కొనుగోలు చేయాల్సిన తరుణంలో అందుకు చేసిన కేటాయింపులు సరిగా లేవన్నారు. 2018 నాటికి 23,600 మెగా వాట్లకు పైగా విద్యుదుత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవని విమర్శించారు. పినిపాక నియోజకవర్గంలో మణుగూరుకు 1080 మెగావాట్ల పవర్ ప్లాంట్ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ.. వెంటనే దాని పనులు మొదలు పెట్టాలని కోరారు.
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. దుమ్ముగూడెం ఇందిర సాగర్, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, కిన్నెరసాని ఎడమ కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ బిల్లులు ఆపడం సరికాదన్నారు.
తెలంగాణ అమరవీరుల సంఖ్యను అప్పట్లో 1200గా పేర్కొని ఇప్పుడు 481 మందికే లబ్ధిచేకూర్చే ప్రయత్నం సరికాదన్నారు. రుణమాఫీ అమలు చేయాలని, అంతకు ముందుగానే రైతులకు దన్నుగా ప్రతి రైతు ఖాతాలో రూ. 10 వేల చొప్పున జమ చేయాలని కోరారు. యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు.