రూ.2,740 కోట్లు ఇవ్వండి
కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం నుంచి తెలంగాణను ఆదుకునేందుకు రూ.2,740 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. అకాల వర్షాలతో ఊహించని విధంగా నష్టం జరిగిం దని, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఇతోధిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బృందాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిం చి వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, పంట నష్టాన్ని పరిశీలించారు.
ఆదివారం హైదరా బాద్‌కు వచ్చిన బృందం వివిధ శాఖల ఉన్న తాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భం గా అకాల వర్షాలతో వాటిల్లిన నష్టాన్ని సీఎస్ రాజీవ్‌శర్మ శాఖలవారీగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టానికి తాత్కాలిక ఉపశమనంగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని బృందానికి సారథ్యం వహించిన హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ వెల్లడించారు. అనంతరం కేంద్రం బృందం కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర బృందం సంగారెడ్డి జిల్లా అధికారులతో సమా వేశమైంది. పంట నష్టం జరిగిన తీరుపై కలెక్టరేట్ ఆవరణలో ఫొటో ప్రదర్శనను వారు తిలకించారు. అక్కడి నుంచి నేరుగా బృందం సభ్యులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు.
ఝరాసంగం మండలం జీర్లపల్లిలో వర్షాలకు కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రోడ్డు బ్రిడ్జిని పరిశీలించారు. రాయికోడ్ మండలం జంబ్గి (కె)లో పత్తి, సోయా పంటలను పరిశీలించి.. నష్టం జరిగిన తీరుపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 31,618 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రూ.22.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పిట్లంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, పంట నష్టాన్ని చూసి చలించిపోయింది. రెండో రోజైన సోమవారం హైదరాబాద్‌లో ముంపునకు గురైన వివిధ ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను కేంద్ర బృందం పరిశీలించనుంది.