సాక్షి, హైదరాబాద్: పార్టీ జాతీయ నాయకత్వం సూచనల మేరకు రాష్ట్ర స్థాయి అంశాలతో తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. మన్ కీ బాత్.. మోదీ కే సాత్ నినాదంతో ప్రజాభిప్రాయాలతో కూడిన మేనిఫెస్టోను సిద్ధం చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 15 రంగాలకు చెందిన ప్రముఖులు, 10 వేల మంది ప్రజలు, 800 మంది వివిధ వర్గాల నేతల అభిప్రాయాలను రాష్ట్ర బీజేపీ, మేనిఫెస్టో కమిటీ సేకరించింది. వారి అభిప్రాయాలతో తెలంగాణ మన్ కీ బాత్.. మోదీకే సాత్ పేరుతో మేనిఫెస్టోను రూపొందించింది. దానిని బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ రాకేశ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అందజేశారు.
మోదీ సభల్లో చేరికలు..
జాతీయ నాయకత్వం రూపొందించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో రాష్ట్రస్థాయిలో రూపొందించిన మేనిఫెస్టో అంశాలను పొందుపరుస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్ వెల్లడించారు. గురువారం (27న) ఈ మేనిఫెస్టోను జాతీయ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేస్తామని వివరించారు. ఈ నెల 29వ తేదీ, వచ్చే నెలలో జరిగే మోదీ బహిరంగ సభల్లో ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరతారని వివరించారు. రాష్ట్రంలో కారుకు పంచర్ తప్పదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం కోసం దేశ ప్రజలు కళ్లల్లో వత్తులేసుకొని చూస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా బీజేపీలోకి చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు.
విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం, సాగు నీరు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సం క్షేమ, దేశ రక్షణ తదితర అంశాలకు సంబంధించిన ఆలోచనలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామని మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ రాకేశ్‌రెడ్డి చెప్పారు. సరూర్‌నగర్‌లో నమోదైన కేసుతో మురళీ ధర్‌రావుకు ఏ సంబంధం లేదని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు చెప్పారు. ఆయనపై బురద జల్లేందుకే ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని.. దానిని తాము ఎదుర్కొంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment