
సాక్షి, మహబూబ్‌నగర్/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహబూబ్‌నగర్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. పాలమూరు జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మహబూబ్‌నగర్, చేవెళ్ల, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30కు జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలు భారీఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఆవశ్యకత.. ఐదేళ్లలో దేశంలో బీజేపీ పాలన తీరును ప్రధాని వివరించనున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుండడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్ధానాల నుంచి రెండు లక్షలకు తగ్గకుండా జనాన్ని సమీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. పార్టీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి పరిచయ కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. 4నెలల వ్యవధిలో మోదీ పాలమూరుకు రావడం ఇది రెండోసారి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది నవంబర్ 28న మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ శంఖారావంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అలాగే ఏప్రిల్ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 5:30 గంటలకు జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని లక్ష్మణ్ వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
ప్రధానమంత్రి బహిరంగ సభకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చిన ప్రత్యేక 30 ఎస్‌పీజీ, 40 సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు మొత్తం వెయ్యి మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్‌పీజీ బలగాలు సభా ప్రాంగణాన్ని తమ అధీనంలో తీసుకున్నాయి. సుమారు 40 ఎకరాల మైదానంలో సభకు ఏర్పాట్లు జరిగాయి. 40–50 మంది కూర్చునే విధంగా భారీ వేదికను సిద్ధం చేశారు. ముఖ్యమైన నాయకులనే వేదికపైకి ఆహ్వానించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment