వేధింపులు మానుకోవాలి | Stop bullying | Sakshi
Sakshi News home page

వేధింపులు మానుకోవాలి

Published Wed, Mar 9 2016 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

Stop bullying

లేదంటే సామూహిక సెలవులో వెళ్తాం
డీఆర్‌డీఏ పీడీకి ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హెచ్చరిక

 
హన్మకొండ అర్బన్: డీఆర్‌డీఏ ఐకేపీలో కొద్ది నెలలుగా పీడీ- ఉద్యోగుల మధ్య చాపకింద నీరుగా సాగుతున్న వేధింపులు ఆరోపణల వ్యవహారం  రచ్చకెక్కింది. జిల్లా కార్యాలయంలో ఒకరిద్దరు అధికారుల పెత్తనంతో ఉన్నతాధికారులు సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఉద్యోగులు పీడీపై అసమ్మతి ప్రకటించారు. తమపై వేధింపులు మానుకోవాలని కోరుతూ ఆయనకు లేఖ ఇచ్చారు. ఈ విషయూన్ని కలెక్టర్, సెర్ప్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని సెర్ప్ ఉద్యోగుల సంఘక్షేమ సంఘం నాయకులు తెలిపారు.

ఒకరిద్దరి పెత్తనంపై ఆరోపణలు...
కొద్ది నెలల క్రితం ఐకేపీకి ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లపై వచ్చిన  ఉద్యోగులను ఆయా శాఖలకు తిప్పి పంపించారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ఒక మహిళా ఉద్యోగిని మాత్రం మాతృశాఖకు పంపకుండా ఐకేపీలో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అనుభవజ్ఞులు ఉన్నా సదరు అధికారిణికి ఆ విభాగం ఆప్పగించడం ఏంటనే చర్చ కొనసాగింది. డిప్యూటేషన్‌పై వచ్చిన వారందరినీ తిరిగి పంపించి, ఒకరిద్దరికి మాత్రం మినహారుుంపు ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక పీడీ వద్ద తమ మాటే చెల్లుబాటవుతందని భావించిన కొందరు అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగులను పలుమార్లు వేధించారనే ఆరోపణలు సైతం ఉన్నారుు. దీన్ని పలుమార్లు పీడీ దృష్టి తీసుకొచ్చినా ఆయన స్పందించలేదని ఉద్యోగులు అంటున్నారు.  

వేధింపులు ఆపకుంటే ఆందోళనే..
 ఉద్యోగులపై వేధింపులు మానుకోవాని, వారితో స్నేహపూర్వకంగా పని చేయించుకోవాలని కోరుతూ మంగళవారం ఉద్యోగ సంఘం నాయకులు పీడీకి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లు అమలు చేయూలని, లేదంటే మూకుమ్మడిగా సెలవు పెట్టి వెళ్తామని స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలతో క్రమశిక్షణా చర్యలకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి నెల ఉద్యోగులతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులు ఉపసంహరించుకోవాలని, తనిఖీలకు వెళ్లే ముందు మహిళా సంఘాలకు సమాచారం ఇవ్వాలని, ఉద్యోగులకు సాయంత్రం 5 గంటల తర్వాత పని చెప్పకూడదని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ప్రధాన కార్యదర్శి రాజీర్, మాదారపు రవి, నాయకులు కందుల అనిల్ కుమార్, దయాకర్, సుధాకర్ ఉన్నారు.
 
తప్పు చేసినవారిపైనే చర్యలు : డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి
 సెర్ప్ ఉద్యోగుల ఫిర్యాదు విషయంపై డీఆర్‌డీఏ పీడీ వెంటేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా శాఖలో అధికారులు, ఉద్యోగులు అందరం కలిసి పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని, ఈ క్రమంలో తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకరిద్దరు ఉద్యోగుల వల్ల శాఖకు చెడు పేరు రావడం మంచిది కాదని, అందుకే అలాంటి వారి విషయంలో ఉపేక్షించబోమని తెలిపారు. ఉద్యోగులు చేసిన ఫిర్యాదు విషయం పరిశీలిస్తామని, దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement