మునిపల్లి: తమతో పని చేయించుకుని డబ్బులివ్వమంటే ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని గీత కార్మికులు మునింలను నిలదీశారు. ఆదివారం మండలంలోని తాటిపల్లి గ్రామ శివారులోని వనంలో గీత కార్మికులు తమకు వెంటనే వేతనాలు ఇవ్వాలని మునీంలను డిమాండ్ చేశారు.
115 రోజులుగా ఇక్కడే పని చేస్తున్నాం.. ఇప్పటి వరకు తమకు సుమారు 3000 రూపాయల చొప్పున 33 మందికి అడ్వాన్సు ఇచ్చినట్లు గీత కార్మికులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామం నుంచి ఐదుగురు, మదూర్ మండలం బొమ్మూరు నుంచి 12 మంది, బొనిడు గ్రామం నుంచి ఏడుగురు, అనాజిపూరం నుంచి ఇద్దరిని మునింలు కృష్ణయ్య, వెంకన్న తీసుకవచ్చారన్నారు. కల్లు కాంట్రాక్టర్ దగ్గర గీత కార్మికులుగా పని చేస్తే మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామంలోని ఈత వనంలో కల్లు గీస్తే రూ.9100లు ఇప్పిస్తానని ఇద్దరు మునింలు తమను తెచ్చినట్లు గీత కార్మికులు తెలిపారు.
అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి 8 మందితో పాటు మునిపల్లి మండలం తాటిపల్లిలో ముగ్గురు, పిల్లోడి, బొడపల్లి, మన్‌సాన్‌పల్లి నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం 33 మందితో సుమారు 1600 ఇతచెట్ల నుంచి కల్లు గీయించినట్లు తెలిపారు. తాము ఇక్కడకు వచ్చి మూడు నెలల 15 రోజులవుతున్నా వేతనం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తమ యూనియన్ గీత కార్మికులకు రూ. 8,100 చొప్పున చెల్లించాలని చెబితే కాంట్రాక్టర్ రూ.9.100లకు బదులు రూ.6.100 ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బొమ్మూరు గ్రామానికి చెందిన అంజయ్య నాలుగు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నారని, వైద్యం చేయిద్దామంటే తమ వద్ద డబ్బులు లేవని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ఇత వనంలో కల్లు గీయడానికి వచ్చిన ఓ కార్మికుడు వనంలోనే శవమై తేలాడాన్నారు. తమ వద్ద కనీసం ఇంటికి వెళ్లడానికి కూడా బస్సు చార్జీలు లేవని, చాలీ చాలీ భోజనం తింటున్నామని గీత కార్మికులు మునింలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం కల్లు తీసుకపోవడానికి డీసీఎం వస్తే తమ వేతనాలు ఇచ్చేంత వరకు డీసీఎంను కదలినిచ్చేది లేదని గీత కార్మికులు వాహనాన్ని అడ్డుకోవడంతో గ్రామస్తులు ఇరువురిని శాంతింపజేశారు.
3 నెలల 15 రోజుల నుంచి భార్యా పిల్లలకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పంపలేదని, డబ్బులు లేకుండా ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిక్కడపల్లికి చెందిన కల్లు కాంట్రాక్టర్ తమకు వేతనాలు చెల్లించకుండా చేస్తున్నారని, అందువల్లనే కల్లుకోసం వచ్చిన డీసీఎంను అడ్డుకున్నామన్నారు.
పని చేయించుకొని డబ్బులివ్వరా..?
Published Sun, Dec 28 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM
Advertisement