సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీలు | Sub-Committees for solve problems | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీలు

Published Sun, Jun 21 2015 3:19 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీలు - Sakshi

సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీలు

- స్వచ్ఛ హైదరాబాద్ సమీక్షలో సీఎం
- ప్రజల భాగస్వామ్యంతో నగరాభివృద్ధి
- జీహెచ్‌ఎంసీకే చెత్త సేకరణ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్‌లో ప్రధాన సమస్యలుగా ఉన్న చెత్త, నాలాలు, డ్రైనేజీ, తాగునీరు తదితర అంశాల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో ప్రత్యేక(సబ్) కమిటీలను వేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమన్వయ కమిటీ సభ్యులు(ప్రజాప్రతినిధులు) అందజేసిన నివేదికలపై శనివారం ఇక్కడి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంశాలవారీగా ప్రజాప్రతినిధులతో సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, కమిటీల సిఫార్సులను ప్రభుత్వం యథాతథంగా స్వీకరించి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కమిటీలు ప్రతీవారం సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, నగరానికి చెందిన మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.
 
అందరం కలిస్తేనే అద్భుత నగరం..
రాజకీయాలకు అతీతంగా నగరం సమగ్రంగా అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. అందరం కలసి హైదరాబాద్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. నగరంలో చెత్త సేకరణ పనుల్ని ఏ ఇతర సంస్థలకూ అప్పగించకుండా జీహెచ్‌ఎంసీయే చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 700 మిలియన్ లీటర్ల సివరేజిని ట్రీట్ చేస్తున్నారని, మరో 600 ఎంఎల్‌డీలు ట్రీట్ చేయగలిగితే మూసీని శుభ్రమైన నీటితో ప్రవహించేలా చేయవచ్చన్నారు.
 
డబ్బు కట్టిన వెంటనే నల్లా కనెక్షన్
నగర జనాభాకు సరిపడా కూరగాయల మార్కెట్లు, మాంసాహార, చేపల మార్కెట్లను ఏర్పాటు చేయాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. మార్కెట్ల నిర్మాణానికి, చెత్త వేసేందుకు తగిన స్థలాలు సేకరించాలని అధికారులకు సూచించారు. చెత్త నిర్వహణకు ఢిల్లీ, నాగ్‌పూర్ పర్యటనల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. డబ్బు కట్టినవారికి వెంటనే తాగునీటి నల్లా కనెక్షన్ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నగర ప్రజల మంచినీళ్ల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తగిన కోటా ఇస్తామని హామీ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా నగరంలోని ముస్లిం ప్రార్థనా మందిరాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ పనుల్ని తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు నగరాభివృద్ధికోసం ఒకచోట చేరడం చారిత్రక ఘట్టమని కేసీఆర్ అభివర్ణించారు.
 
వీటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు..

1. మంచినీటి సరఫరా, 2. నాలాల నిర్వహణ, 3. చెత్త సేకరణ, 4. శిథిలాల తొలగింపు, 5. సివరేజి, 6. డంప్ యార్డులు, 7. అర్బన్ హెల్త్ సెంటర్లు, 8. మార్కెట్లు, మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు, 9. మౌలిక సదుపాయాల కల్పన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement