సబ్సిడీ కిరోసిన్‌కు మంగళం! | subsidy kerosin cancel of ranga reddy district | Sakshi
Sakshi News home page

సబ్సిడీ కిరోసిన్‌కు మంగళం!

Published Wed, Jun 17 2015 11:50 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

subsidy kerosin cancel of ranga reddy district

పేదలకు అందుబాటులో వంటగ్యాస్
దశలవారీగా కిరోసిన్ కోటా కట్
‘దీపం’ కింద ఈ నెలాఖరులో
70వేల మందికి గ్యాస్ కనెక్షన్లు
జిల్లాలో కుటుంబాలు: 12 లక్షలు
నెలనెలా కిరోసిన్ పంపిణీ: 2004 కిలోలీటర్లు
ఈ నెలాఖరు వరకు ఇవ్వనున్న  ‘దీపం’ కనెక్షన్లు:  70వేలు

 
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు పంపిణీ చేస్తున్న కిరోసిన్‌ను ఎత్తివేయాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ప్రతి కుటుంబానికి వంట గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సబ్సిడీ కిరోసిన్‌కు మంగళం పాడాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేదలకు విరివిగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దీపం’ పథకం కింద జిల్లాకు 70వేల గ్యాస్ కనెక్షన్లను జారీచేసింది. నియోజకవర్గానికి ఐదు వేల మంది లబ్ధిదారులకు వీటిని జారీ చేయాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం... ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల కుటుంబాలకు 2004 కిలోలీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కుటుంబాలకు గ్యాస్‌ను సమకూర్చడం ద్వారా కిరోసిన్ కోటాను రద్దు చేయాలని యోచిస్తోంది.

కుటుంబాలకంటే కనెక్షన్లు ఎక్కువ!
మన జిల్లాలో కుటుంబాలకంటే అధికంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంటే నమ్ముతారా? ఔను.. ఇది నిజం. చమురు కంపెనీలు ఇటీవల తేల్చిన లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాలను మంచి గ్యాస్ కనెక్షన్లు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గ్యాస్ ముఖం చూడని కుటుంబాలెన్నో ఉండగా, గ్యాస్‌కనెక్షన్లు మాత్రం 121 శాతం నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 12,84,755 లక్షల కుటుంబాలు ఉండగా, 15,59,312 లక్షల గ్యాస్ క నెక్షన్లు ఉన్నట్లు ఆయిల్ సంస్థలు నివేదించాయి.

జిల్లా అధికారులు మాత్రం ఆయిల్ కంపెనీల వాదనతో విబేధిస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో 12.35లక్షలున్న కుటుంబాలు కాస్తా.. గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నాటికి 16.54 లక్షలు ఉన్నట్టు తేలినందున.. ఇందులో ఆశ్చర్చపడాల్సిన అవసరమేమీలేదని కొట్టిపారేస్తున్నారు. కుటుంబాల సంఖ్య వృద్ధికి అనుగుణంగానే గ్యాస్ కనెక్షన్లు పెరిగాయని అంటున్నారు. కొన్ని కుటుంబాలు ఒక కనెక్షన్‌కంటే అదనంగా కలిగి ఉండే అవకాశమున్నందున.. కనెక్షన్ల సంఖ్య కుటుంబాలను దాటి ఉండే వీలులేకపోలేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement