సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్‌బజార్ మధ్య నుంచి మెట్రో పనులు కొనసాగిస్తామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీగాడ్గిల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంద్ పాటించాలని స్థానిక ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ అధ్యక్షులు సురేంద్రమాల్ లూనియా, ప్రధాన కార్యదర్శి సి.మధుసూదన్‌లు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రోను రానివ్వనుని ఇచ్చిన హామీ మేరకు మెట్రో రైలు కారిడార్-2ను రద్దు చేయాలని వారు కోరారు. మెట్రో వస్తే తన మెడకాయ నుంచి పోతుందని గతంలో సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులు ఉద్యమాలు చేస్తున్నారని, దీనిని గుర్తించి ప్రభుత్వం వెంటనే సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో వచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు హరీష్ జ్ఞాని, ఖలీల్ అహ్మద్, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సుల్తాన్‌బజార్ బంద్
Published Fri, Nov 27 2015 12:54 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement