అందరి అభీష్టం మేరకే సునీతకు డీసీసీ పగ్గాలు
నర్సాపూర్: ఇటీవల జరిగిన మెదక్ ఉప ఎన్నికలో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేకూరిందని, సునీతారెడ్డి అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతారని, ఆమెకే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని జిల్లా కాంగ్రెస్ నాయకుల కోరిన మేరకు ఆమెకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి వాకిటి సునీతారెడ్డికి శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సునీతారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఏ సమ స్య వచ్చినా ముఖ్య నాయకుల సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఇతర నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని నాయకుల సహకారంతో పార్టీకి పూ ర్వ వైభవం తెచ్చి 2019 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచెందుకు పార్టీని సిద్ధ చేసేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే గీతారెడ్డి, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, శశిధర్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదతరులు పాల్గొని సునీతారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
తరలివెళ్లిన నాయకులు
మాజీ మంత్రి సునీతారెడ్డికి శుక్రవారం హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే కార్యక్రమానికి నర్సాపూర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. నర్సాపూర్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, బ్లాక్ అధ్యక్షుడు సత్యంగౌడ్, ఆంజనేయులుగౌడ్, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు తరలివెళ్లారు.